Chandrababu: మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తీసుకువచ్చారు: చంద్రబాబు
- పార్టీ నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్
- సీఎం అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు
- జగన్ కు ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధానం అని వ్యాఖ్యలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తాజా పరిణామాలపై వ్యాఖ్యానించారు. ఓటు బ్యాంకు రాజకీయమే తప్ప ఏ మతంపైనా జగన్ కు విశ్వాసం లేదని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మత చిచ్చు రగిలిస్తున్నారని మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని తగులబెడుతున్నారని తెలిపారు.
సీఎం ఏ మతస్థుడైనా కావొచ్చు, కానీ అన్ని మతాలను సమదృష్టితో చూడాలని హితవు పలికారు. రాష్ట్రంలోని అన్ని ప్రార్థన మందిరాలను కాపాడాల్సిన బాధ్యత సీఎంపై ఉందని స్పష్టం చేశారు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, ఇతర అంశాలపై స్పందిస్తూ, రూ.770 కోట్లు ఖర్చు చేసిన ఫైబర్ గ్రిడ్ లో రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందా? అని ప్రశ్నించారు. వైసీపీ తప్పుడు ప్రచారానికి ఇంతకంటే రుజువేం కావాలని అన్నారు. టీడీపీపై కక్షసాధింపు తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై వైసీపీ ఎంపీలకు దృష్టిలేదని విమర్శించారు. నాపై గతంలో 26 విచారణలు చేయించి ఏదీ నిరూపించలేకపోయారు అంటూ వెల్లడించారు. మంత్రి జయరాంపై సాక్ష్యాధారాలు ఉన్నా చర్యలు లేవని, కానీ ఎలాంటి తప్పు చేయని అచ్చెన్నాయుడిని మాత్రం అన్యాయంగా 80 రోజులు జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రలోభాలకు గురిచేసి కొందరిని లాక్కున్నంత మాత్రాన టీడీపీకి నష్టమేమీ లేదని, ఒకరు పోతే వంద మందిని తయారుచేసే సత్తా టీడీపీకి ఉందని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాజీనామా చేయించాకే పార్టీలోకి తీసుకుంటామన్న జగన్ మాట ఏమైందని నిలదీశారు.