Bandi Sanjay: నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది: బండి సంజయ్

Bandi Sanjay criticizes CM KCR over LRS issue

  • ఎల్ఆర్ఎస్ పై భగ్గుమంటున్న విపక్షాలు
  • కలెక్టరేట్ల వద్ద బీజేపీ నిరసనలు
  • రాత్రి నుంచే అరెస్టులు చేస్తున్నారన్న బండి సంజయ్

ఇప్పటివరకు క్రమబద్ధీకరించుకోని లే అవుట్లు, స్థలాలను క్రమబద్ధీకరించుకోవడానికి తెలంగాణ సర్కారు లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్-2020 (ఎల్ఆర్ఎస్) తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలిసో తెలియకో తక్కువ ధరకు వస్తుందని  ప్లాట్లు కొని మోసపోయిన సామాన్యులపై ఎల్ఆర్ఎస్ భారం మోపుతున్నారని, ఎల్ఆర్ఎస్ పేరుతో భారీగా ఫీజులు దండుకుంటున్నారని విపక్షాలు ఎలుగెత్తుతున్నాయి.

ఈ క్రమంలో జిల్లా కలెక్టరేట్ల వద్ద బీజేపీ శ్రేణులు ఎల్ఆర్ఎస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పలుచోట్ల అరెస్టులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ, నిరసన అంటేనే తట్టుకోలేని అహంకారపూరిత వైఖరి కేసీఆర్ ది అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో హక్కుల కోసం గొంతెత్తడం కూడా నేరమవుతోందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్, మంత్రులు అబద్ధాలు, అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో ఆశపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని, మున్సిపల్ ఎన్నికల్లో గట్టి సమాధానం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కరోనా సంక్షోభ సమయంలో ఎల్ఆర్ఎస్ భారం మోపడం ప్రభుత్వ అమానవీయ వైఖరికి నిదర్శనం అని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలను, హక్కులను పోలీసుల సాయంతో కాలరాస్తున్నారని, ఎల్ఆర్ఎస్ పై కలెక్టరేట్ల వద్ద నిరసన చేపట్టిన బీజేపీ నేతలు, కార్యకర్తల అరెస్టు దారుణమని బండి సంజయ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను రాత్రి నుంచే అరెస్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు.

అయినప్పటికీ ప్రభుత్వ నిర్బంధాలను, ఆంక్షలను దాటుకుని కలెక్టరేట్లకు చేరుకున్న నేతలకు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ అంటూ బండి సంజయ్ ట్విట్టర్ లో స్పందించారు. కలెక్టరేట్ల ముట్టడి విజయవంతం చేయడం ద్వారా ఉద్యమస్ఫూర్తిని చాటారని కితాబునిచ్చారు.

  • Loading...

More Telugu News