Galla Jayadev: ఇంతవరకు ఒక్క అరెస్ట్ లేదు... ఏపీ ఆలయాలపై దాడి ఘటనలను లోక్ సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్
- పిఠాపురంలో 23 విగ్రహాలు ధ్వంసం చేశారని వెల్లడి
- ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపణ
- కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
ఏపీలో గత కొంతకాలంగా ఆలయాలపై జరుగుతున్న దాడి ఘటనలను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ లోక్ సభలో ప్రస్తావించారు. పిఠాపురంలో 23 విగ్రహాలను ధ్వంసం చేశారని వెల్లడించారు. ఏపీలో హిందువులపై తీవ్రస్థాయిలో దాడులు జరుగుతున్నాయని, కానీ ఏపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. దేవాలయాలపై దాడుల కేసులో ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని ఆరోపించారు.
టీటీడీ భూములను విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, భక్తులు వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని గల్లా జయదేవ్ తెలిపారు. ఏపీలో దేవాలయాల ఘటనలపై కేంద్రం జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సభాముఖంగా విజ్ఞప్తి చేశారు.
కాగా, టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు రైల్వే జోన్ అంశంపై లోక్ సభలో మాట్లాడారు. రైల్వే జోన్ పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు. వాల్తేర్ డివిజన్ ను మూసివేయడం సమంజసం కాదని, కొత్తగా ప్రకటించిన రైల్వే జోన్ పరిధిలోకి ఏపీ భూభాగం మొత్తం వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.