Mudragada Padmanabham: మీ కోరికను మన్నించలేకపోతున్నా.. క్షమించండి: ముద్రగడ పద్మనాభం
- కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని చెప్పిన ముద్రగడ
- వ్యక్తిగతంగా మీతోనే ఉంటానని వ్యాఖ్య
- తనను ఇబ్బంది పెట్టవద్దని విన్నపం
కాపు ఉద్యమానికి నాయకత్వం వహించలేనని ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఈరోజు 13 జిల్లాల నుంచి కిర్లంపూడిలోని తన నివాసానికి వచ్చిన కాపు జేఏసీ నేతలతో ఆయన భేటీ అయ్యారు. కాపు ఉద్యమంపై వీరు అరగంటకు పైగా సమాలోచనలు జరిపారు. అనంతరం ఓ లేఖను విడుదల చేశారు.
'గౌరవ పెద్దలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములు చేసుకుంటున్నాను. మీ కోరికను గౌరవించలేకపోతున్నందుకు క్షమించమని కోరుచున్నాను. వ్యక్తిగతంగా నేను మీతోనే ఉంటానండి. మనం మంచి స్నేహితులం. మీ ఇంటిలో ఏ కార్యక్రమం ఉన్నా తెలియజేస్తే నా ఓపిక ఉన్నంత వరకు వస్తానండి. మీ అందరి అభిమానం, ప్రేమ మరువలేనిది. నా ఇంటిలో ఏ శుభకార్యం ఉన్నా నేనే స్వయంగా జిల్లాలకు వచ్చి ఓపిక ఉన్నంత వరకు ఆహ్వానిస్తాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరుచున్నాను' అని లేఖలో ముద్రగడ పేర్కొన్నారు.
మరోవైపు, ఉద్యమానికి నాయకత్వం వహించలేనని ముద్రగడ స్పష్టం చేయడంతో... ఇకపై ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహిస్తారనే చర్చ జరుగుతోంది.