Boat: రాజస్థాన్ లో విషాద ఘటన... 40 మంది భక్తులతో వెళుతున్న బోటు మునక.. పలువురి మృతి
- కోటా జిల్లాలో చంబల్ నదిలో ప్రమాదం
- కమలేశ్వర్ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బోటు
- ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చిన 25 మంది వ్యక్తులు
- 11 మృతదేహాల వెలికితీత
రాజస్థాన్ లో విషాద ఘటన జరిగింది. కోటా జిల్లాలోని చంబల్ నదిలో 40 మందితో ప్రయాణిస్తున్న బోటు నీట మునిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మృతదేహాలను వెలికితీశారు. ఈ బోటు ఇంద్రగఢ్ ప్రాంతంలో ఉన్న కమలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి భక్తులను తీసుకువెళుతోంది.
ఈ ఉదయం ప్రమాదం జరిగిందని కోటా జిల్లా రూరల్ ఎస్పీ శరద్ చౌదరి తెలిపారు. 20 నుంచి 25 మంది వరకు ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చారని వెల్లడించారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి. ఈ బోటులోని వ్యక్తులు ఖటోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు. కాగా, ఈ బోటు ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను పునరుద్ధరించుకోకుండానే ప్రయాణాలు చేపడుతున్నట్టు తెలిసింది.