Manikam Tagore: తెలంగాణ సెక్రటేరియట్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం: రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్
- కుంతియా స్థానంలో వచ్చిన మాణిక్యం ఠాగూర్
- జూమ్ యాప్ ద్వారా టీపీసీసీ సమావేశం
- సెక్రటేరియట్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలన్న ఠాగూర్
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన అధిష్ఠానం వివిధ రాష్ట్రాల్లో పార్టీ వ్యవహారాలు చూసేందుకు కొత్త ఇన్చార్జిలను నియమించిన సంగతి విదితమే. తెలంగాణలో ఇప్పటివరకు పార్టీ వ్యవహారాలు చూసిన కుంతియాను తొలగించి, నూతన ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్ ను నియమించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.
తాజాగా జూమ్ యాప్ ద్వారా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ, పార్టీ నేతలు, కార్యకర్తలకు క్రమశిక్షణ ఎంతో అవసరమని ఉద్ఘాటించారు. సోషల్ మీడియాను ఇష్టానుసారం ఉపయోగించుకోవద్దని సూచించారు. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి కోర్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి అంశంలోనూ పార్టీ సిద్ధాంతపరమైన సామాజిక న్యాయాన్ని తప్పనిసరిగా పాటిద్దామని పిలుపునిచ్చారు.
అంతేకాదు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు, పట్టభద్రుల మండలి ఎన్నికల అంశంపైనా ఆయన చర్చించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యుయేట్ మండలి ఎన్నికలకు త్వరగా అభ్యర్థులను ఎంపిక చేయాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీవ్రంగా పరిగణించాలని అన్నారు. తెలంగాణ సెక్రటేరియట్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు కదంతొక్కాలని మాణిక్యం ఠాగూర్ పిలుపునిచ్చారు.