Budda Venkanna: సజ్జల మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే లాడెన్ శాంతి ప్రవచనాలు చెప్పినట్టుంది: బుద్ధా వ్యంగ్యం
- విపక్షం మీడియా స్వేచ్ఛను హరిస్తోందన్న సజ్జల
- జీవో 2430 తీసుకువచ్చింది ఎవరంటూ బుద్ధా ట్వీట్
- ప్రశ్నించిన పాత్రికేయులను వేధిస్తున్నారని ఆగ్రహం
ప్రతిపక్షమే మీడియా నోరు నొక్కేస్తోందని, మీడియా స్వేచ్ఛను హరించే విధంగా విపక్షం వ్యవహరిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటుగా స్పందించారు. సజ్జల గారు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే లాడెన్ శాంతి ప్రవచనాలు చెప్పినట్టు ఉందని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్... మీడియా గొంతు నొక్కుతూ జీవో 2430 తీసుకువచ్చారని బుద్ధా మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, విచారణ పేరుతో పాత్రికేయుల్ని వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పాత్రికేయుడిగా పనిచేసి, తనలోని ప్రశ్నించే సామర్థ్యాన్ని ప్రస్తుతం జగన్ రెడ్డి కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇవాళ మీడియా స్వేచ్ఛ గుర్తుకురావడం పెద్ద విశేషమేనని వ్యంగ్యం ప్రదర్శించారు.