Andhra Pradesh: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై చర్చలు జరిపిన తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు
- లాక్ డౌన్ సడలించినా తిరగని అంతర్రాష్ట్ర బస్సులు
- రూట్ల వారీగా స్పష్టత కోరుతున్న తెలంగాణ
- ఇలాంటి ప్రతిపాదన ఏ రాష్ట్రం పెట్టలేదన్న ఏపీ
- రెండ్రోజుల్లో మరోసారి సమావేశమవ్వాలని అధికారుల నిర్ణయం
లాక్ డౌన్ సడలింపులు అమల్లోకి వచ్చినా, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులకు మోక్షం కలగలేదు. కిలోమీటర్లు, బస్సు రూట్ల అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఏపీ, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి. దీనిపై ఇప్పటికే పలు పర్యాయాలు ఏపీ, తెలంగాణ రవాణశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరిపినా ప్రయోజనం శూన్యం.
ఈ నేపథ్యంలో ఇవాళ రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు. ఏపీ తరఫున ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు, ఈడీ బ్రహ్మానందరెడ్డి... తెలంగాణ తరఫున ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ, రూట్ల వారీగా ఉభయ రాష్ట్రాలు సమానంగా బస్సు సర్వీసులు నడపాలని ప్రతిపాదించామని తెలిపారు. రూట్ల వారీగా స్పష్టత ఇస్తేనే తాము ముందడుగు వేస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరితేనే తాము బస్సులు తిప్పుతామని సునీల్ శర్మ స్పష్టం చేశారు.
ఇక, ఏపీ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు మాట్లాడుతూ, సమాన కిలోమీటర్ల అంశానికి తాము మొగ్గు చూపుతున్నామని వెల్లడించారు. కిలోమీటర్ల గ్యాప్ ను 50 శాతం తగ్గించేందుకు తాము సమ్మతించామని, అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీని 50 శాతం పెంచుకోమని చెప్పామని వివరించారు. రూట్ల వారీగా స్పష్టత ఇవ్వాలని తెలంగాణ కోరుతోందని, ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఇలాంటి ప్రతిపాదన చేయలేదని తెలిపారు. దీనిపై చర్చించేందుకు రెండ్రోజుల్లో మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించామని కృష్ణబాబు చెప్పారు. అయితే, తుది నిర్ణయం వచ్చేవరకు చెరో 250 బస్సులు నడుపుకుందామని ప్రతిపాదించగా, తెలంగాణ అధికారులు అందుకు అంగీకరించలేదని అన్నారు.