jaya bachan: సినీ పరిశ్రమలో డ్రగ్స్ గురించి రాజ్యసభలో జయా బచ్చన్ కీలక వ్యాఖ్యలు
- సినీ పరిశ్రమను తప్పుబట్టడం సరికాదు
- సినీ పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి
- సినీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో విచారణ జరుపుతోన్న అధికారులు బాలీవుడ్‌లో డ్రగ్స్ వినియోగం గురించిన కీలక సమాచారాన్ని రాబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌పై పలువురు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంపీ జయాబచ్చన్ ఈ రోజు రాజ్యసభలో మాట్లాడుతూ... డ్రగ్స్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని సినీ పరిశ్రమను తప్పుపట్టడం సరికాదని చెప్పారు.
సినీ పరిశ్రమకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. కొందరు చేసిన తప్పుల కారణంగా సినీ పరిశ్రమ మొత్తంపై నిందలు వేయడం సరికాదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటులు భారత్‌లో ఉన్నారని ఆమె అన్నారు. లోక్‌సభలో నిన్న సినీ పరిశ్రమ గురించి ఓ ఎంపీ ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పారు.
సినీ పరిశ్రమలో పని చేసిన ఆ వ్యక్తి అదే పరిశ్రమ గురించి అలా మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను నిర్వీర్యం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆమె అన్నారు. రాజ్యసభలో జీరో అవర్‌లో దీనిపై మాట్లాడాలని కోరారు.