Parliament: ప్రతి ఎంపీకీ స్పీకర్ నుంచి ప్రత్యేక కొవిడ్ కిట్... ఏమేమున్నాయంటే..!
- నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలు
- మాస్క్ లు, శానిటైజర్లు, హెర్బల్ టీ బ్యాగ్స్ పంపిణీ
- ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలన్న స్పీకర్
నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో, స్పీకర్ ఓమ్ ప్రకాశ్ బిర్లా, సభకు హాజరైన ప్రతి సభ్యుడికీ ఓ ప్రత్యేక బ్యాగ్ ను పంపారు. ఈ సమావేశాలు 18 రోజులపాటు సాగనున్న నేపథ్యంలో, కరోనా బారిన పడకుండా తమకు తాము తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కిట్ లను డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) స్వయంగా తయారు చేయడం గమనార్హం.
ఇక ఒక్కో కిట్ లో 40 డిస్పోజబుల్ మాస్క్ లు, ఐదు ఎన్-95 మాస్క్ లు, ఒక్కొక్కటి 50 ఎంఎల్ పరిమాణం గల 20 శానిటైజర్ బాటిళ్లు, 40 జతల చేతి తొడుగులు, ఫేస్ షీల్డ్ లు, హెర్బల్ శానిటైజేషన్ వైప్స్ తదితరాలు ఇందులో ఉన్నాయి. ఇక, ఈ బ్యాగ్ ను తెరిచేందుకు, మూసేందుకు టచ్ ఫ్రీ హుక్ ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు... ప్రతి కిట్ లోనూ రోగ నిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీ బ్యాగ్స్ ను కూడా జత చేశారు.
ఇక ఈ బ్యాగ్ తో పాటు ఓ లేఖను పంపిన ఓం ప్రకాశ్ బిర్లా "పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యాయని మీకందరికీ తెలుసు. అక్టోబర్ 1 వరకూ ఇవి సాగుతాయి. మధ్యలో ఒక్కరోజు కూడా సెలవు లేదు. ఈ సమావేశాలు ఓ ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్నాయి. మనపై ఉన్న రాజ్యాంగ పరమైన బాధ్యతలను నెరవేర్చేందుకు సమావేశం అవుతున్నాం. ప్రతి ఒక్కరూ కొవిడ్-19 నియమ నిబంధనలను విధిగా పాటించాలి" అని సూచించారు.
తాను డీఆర్డీఓ తయారు చేసిన నాణ్యమైన శానిటైజర్, ఫేస్ మాస్క్, షీల్డ్ తదితరాలను పంపుతున్నానని, వీటన్నింటినీ వాడుతూ, కరోనా మహమ్మారి బారిన పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని ఓం ప్రకాశ్ బిర్లా కోరారు.