Udhav Thackeray: ప్రస్తుతం నా దృష్టంతా కరోనా కట్టడిపై ఉంది... సరైన సమయంలో స్పందిస్తా: ఉద్ధవ్ థాకరే

Udhav Thackeray responds to ongoing situations
  • ఉద్ధవ్ పై ఇటీవల కంగనా వ్యాఖ్యలు
  • కుట్ర జరుగుతోందన్న ఉద్ధవ్
  • సీఎం ప్రోటోకాల్ పక్కనబెట్టి మరీ స్పందిస్తానని స్పష్టీకరణ
ఇటీవలే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం  తెలిసిందే. ముంబయిలో తన కార్యాలయాన్ని ప్రభుత్వం కూల్చివేయడంపై ఆగ్రహం చెందిన కంగనా... ఉద్ధవ్ థాకరే, ఏమనుకుంటున్నావు నువ్వు? అంటూ సీరియస్ అయింది. ఈ క్రమంలో తాజాగా సీఎం ఉద్ధవ్ థాకరే ఆసక్తికర రీతిలో స్పందించారు. ప్రస్తుతం తన దృష్టి మొత్తం కరోనా కట్టడిపైనే ఉందని, తగిన సమయంలో స్పందిస్తానని అన్నారు. తన మౌనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ బలహీనతగా తీసుకోవద్దని హెచ్చరించారు.

మహారాష్ట్రను అప్రదిష్ఠ పాల్జేసేందుకు కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కరోనా ప్రభావం ముగిసిపోయిందని, కొందరు రాజకీయాలు ప్రారంభించారని ఆరోపించారు. మహారాష్ట్రకు చెడ్డపేరు తెచ్చేందుకు రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం వీటిపై తాను స్పందించాలనుకోవడంలేదని తెలిపారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక, ముఖ్యమంత్రి ప్రోటోకాల్ పక్కనబెట్టి మరీ స్పందిస్తానని అన్నారు.

సుశాంత్ రాజ్ పుత్ మరణం వ్యవహారం రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో, కొన్నిరోజులుగా కంగనా రనౌత్ కు, అధికార శివసేన నేతలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. కంగనా వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మహారాష్ట్ర సర్కారు అక్రమ నిర్మాణం అంటూ ముంబయిలో ఆమె కార్యాలయం కూల్చివేసింది. దాంతో కంగనా కూడా తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుని చండీగఢ్ నుంచి ముంబయి వచ్చారు.
Udhav Thackeray
Maharashtra
Corona Virus
Kangana Ranaut
Mumbai

More Telugu News