Panchumarthi Anuradha: అమ్మఒడి అంటూ ఆర్భాటం చేసి.. నాన్న బుడ్డీలోంచి లాగేశారు: జగన్ పై పంచుమర్తి అనురాధ విమర్శలు
- సంక్షేమ పథకాల్లో కూడా జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారు
- గ్యాస్ వినియోగదారులపై రూ. 1,500 కోట్ల భారాన్ని మోపారు
- సంక్షేమ పథకాల కోసం పన్నులు పెంచుతారా?
సంక్షేమ పథకాల్లో కూడా ముఖ్యమంత్రి జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారని... ఇది సిగ్గుచేటని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. సహజవాయువుపై వ్యాట్ ను 14.5 శాతం నుంచి 24.5 శాతానికి పెంచడం దారుణమని అన్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులపై రూ. 1,500 కోట్ల భారాన్ని జగన్ మోపారని విమర్శించారు. సంక్షేమ పథకాల కోసం ఎవరైనా పన్నులు పెంచుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్టీసీ, విద్యుత్, మద్యం, పెట్రోలియం ధరలను పెంచి ప్రజలపై రూ. 60 వేల కోట్ల భారం మోపారని తెలిపారు.
అమ్మఒడి అంటూ ఆర్భాటం చేశారని... దాన్ని నాన్న బుడ్డీలో నుంచి లాగేశారని అనురాధ దుయ్యబట్టారు. రైతు భరోసా, పెన్షన్ల సొమ్మును విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల్లో లాగేశారని చెప్పారు. వాహనమిత్ర కింద ఇచ్చిన సొమ్మును పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి దోపిడీ చేశారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల అమలు కోసం ఇప్పటి వరకు భూములు అమ్మారని, తాజాగా పన్నులు పెంచుతున్నారని మండిపడ్డారు. ఆదాయాన్ని పెంచడం చేతకాక... సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు.