Congress: సంస్థాగత పదవుల్లో కాంగ్రెస్ భారీ మార్పులు.. గులాంనబీ ఆజాద్‌ సహా సీనియర్లపై వేటు

Team Rahul Scores Ghulam Nabi Azad Loses Post

  • సోనియాకు లేఖ రాసిన వారిపై వేటు
  • పాత తరాన్ని సాగనంపిన సోనియా
  • పార్టీకి వీరవిధేయుడైన రణదీప్ సూర్జేవాలకు పదోన్నతి

కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. వరస ఓటములు, సంక్షోభంతో అల్లాడిపోతున్న పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు అధినేత్రి సోనియా గాంధీ నడుం బిగించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతోపాటు కీలకమైన సంస్థాగత పదవుల్లోనూ భారీ మార్పులు చేసింది. పాత తరాన్ని సాగనంపింది. మరీ ముఖ్యంగా సోనియాకు లేఖ రాయడంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించింది. ఆయన సుదీర్ఘకాలంగా వివిధ రాష్ట్రాల ఇన్‌చార్జిగా, సంస్థాగత వ్యవహారాల కార్యదర్శిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.

ఆజాద్‌తో పాటు సంతకాలు చేసిన జితిన్ ప్రసాద, ముకుల్ వాస్నిక్‌లకు మాత్రం పదోన్నతి కల్పించారు. జితిన్ ప్రసాదను ఉత్తరప్రదేశ్ నుంచి తప్పించి త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌కు ఇన్‌చార్జిగా నియమించారు. ఇక, సోనియాకు లేఖ రాసి, ఆపై క్షమాపణ చెప్పిన ముకుల్ వాస్నిక్‌ను సోనియాకు సాయపడే ప్రత్యేక కమిటీలో చోటిచ్చారు. మొత్తంగా చూస్తే రాహుల్ విధేయులను సీడబ్ల్యూసీలో చేర్చడం గమనార్హం.  

ఏఐసీసీలో భారీ మార్పులు ప్రకటించిన అధిష్ఠానం సీనియర్లను దాదాపు పక్కనపెట్టింది. గాంధీ కుటుంబానికి విధేయులైన మోతీలాల్‌ వోరా, అంబికా సోనీ, లుజినో ఫెలేరో, మల్లికార్జున ఖర్గే లాంటి వారిని ప్రధాన కార్యదర్శి పదవులనుంచి తొలగించింది. గులాంనబీ తొలగింపుపై విమర్శలు రాకుండా జాగ్రత్త పడిన అధిష్ఠానం వీరిని కూడా సాగనంపింది. వారి స్థానంలో సీడబ్ల్యూసీలోకి పి. చిదంబరం, తారిఖ్‌ అన్వర్‌, రణదీప్‌ సూర్జేవాలా, జితేంద్రసింగ్‌లను రెగ్యులర్‌ సభ్యులుగా నియమించింది. కాగా, చిదంబరం, సూర్జేవాలాలు ఇప్పటి వరకు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉండేవారు.  


పార్టీకి అత్యంత విధేయుడైన రణదీప్ సూర్జేవాలకు పదోన్నతి కల్పించి ప్రధాన కార్యదర్శిగా నియమించిన అధినేత్రి సోనియా.. ఆయనకు కర్ణాటక వ్యవహారాలను అప్పగించారు. మరో సభ్యుడు జితేంద్రసింగ్‌కు అసోం బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ ఇన్‌చార్జిగా ఉన్న ఒడిశా నేత రామచంద్ర ఖుంతియాను ఆ బాధ్యతల నుంచి తప్పించి తమిళనాడు ఎంపీ మాణిక్యం ఠాగూర్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.

ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌చార్జిగా మాత్రం కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీనే  సోనియా కొనసాగించారు. సోనియాకు రాసిన అసమ్మతి లేఖలో సంతకం చేసిన శశిథరూర్, మనీశ్ తివారీ, ఆనంద్‌శర్మ, సచిన్ పైలట్‌లకు ఏఐసీసీలో కానీ, సీడబ్ల్యూసీలో కానీ ఎటువంటి స్థానమూ దక్కకపోవడం గమనార్హం. మొత్తానికి రాహుల్ గాంధీకి విధేయులుగా వుండేవారికి కీలక పదవులు అప్పగించి, 'రాహుల్ టీమ్'గా మార్చినట్టుగా కనిపిస్తోంది!  

  • Loading...

More Telugu News