Kannababu: రైతుల ఆత్మహత్యలకు టీడీపీనే కారణం.. రూ. 7 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నాం: కన్నబాబు

TDP Govt is responsible for farmers suicides says Kannababu

  • చంద్రబాబు ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించింది
  • రైతులకు మేము నాణ్యమైన ఎరువులు, విత్తనాలను అందిస్తున్నాం
  • రైతు భరోసా ద్వారా రూ. 10,200 కోట్లను అందించాం

గత టీడీపీ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని ఏపీ మంత్రి కన్నబాబు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే 2019లో 313 మంది రైతులు, 2020లో 157 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని... ఇది ఎంతో దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా పరిహారం అందిస్తున్నామని తెలిపారు. చనిపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవడానికి రూ. 7 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించామని... జిల్లా కలెక్టర్లు వెళ్లి ఈ సాయాన్ని బాధితులకు అందించాలని చెప్పారు.

రైతులకు గ్రామ స్థాయిలో విత్తనాలు అందిస్తూ, రైతులు క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండా చేశామని కన్నబాబు తెలిపారు. రైతులు క్యూలైన్లలో నిలబడి గుండెపోటుతో చనిపోతున్నారంటూ చంద్రబాబు ఆరోపించడం సరికాదని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతుల్లో భరోసా కల్పించామని... ఇప్పటి వరకు రూ. 10,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలను సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతుల ఉత్పత్తుల్లో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో కూడా రైతుల నుంచి అరటి, జామ తదితర పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అన్నారు.

  • Loading...

More Telugu News