MS Dhoni: ధోనీ టీమ్ పై దెబ్బ మీద దెబ్బ... తొలుత రైనా, ఇప్పుడు హర్భజన్ సింగ్!
- దుబాయ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి ధోనీ టీమ్ కు కష్టాలు
- ఇంతవరకూ జట్టుతో జతచేరని హర్భజన్ సింగ్
- పోటీలకు దూరమయ్యే అవకాశాలు
ఏ ముహూర్తాన ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ దుబాయ్ లో అడుగు పెట్టిందో కానీ, తొలి రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. టీమ్ లో 13 మంది కరోనా బారిన పడటం, ఆపై స్టార్ ప్లేయర్ సురేశ్ రైనా, గొడవపడి టీమ్ నుంచి తప్పుకుని ఇండియాకు వచ్చేసిన వార్తలు అభిమానులను కలవరపెట్టి సమయంలో మరో వార్త వెలువడింది. జట్టులో ప్రముఖ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ సీజన్ కు దూరం కానున్నాడన్న వార్త వినిపిస్తోంది.
ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న హర్భజన్ సింగ్ ధోనీ టీమ్ తో కలిసి దుబాయ్ కి వెళ్లలేదు. పైగా, తాను దుబాయ్ కి ఎప్పుడు వస్తానన్న విషయాన్ని ఇంతవరకూ హర్భజన్ వెల్లడించలేదట. ఈ విషయమై సీఎస్కే అధికారి ఒకరు వివరిస్తూ, "ఒకటో తేదీకల్లా హర్భజన్ దుబాయ్ కి వచ్చి జట్టులో కలవాలి. ఈ విషయంలో ఇంతవరకూ అతన్నుంచి ఎటువంటి సమాచారమూ అందలేదు. వస్తాడో, రాడో కూడా తెలియదు. హర్భజన్ వచ్చి, క్వారంటైన్ లో గడిపి, ప్రాక్టీస్ చేసి, జట్టులోకి రావాలంటే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతానికైతే, ఈ సీజన్ లో ఇక అతను ఆడబోడనే అనిపిస్తోంది" అని 'టైమ్స్ నౌ'కు తెలిపారు.
రైనా, హర్భజన్ లు లేకుంటే, ధోనీ టీమ్ కు చాలా కష్టమేనని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు. రైనా తొలగిపోవడంతో, నంబర్ 3లో ఎవరు ఆడాలన్న ప్రశ్న ఇప్పుడు వారిముందుంది. ఇక, హర్భజన్ లేకుంటే, అంతలా స్పిన్ తిప్పి వికెట్లను తీయగల వారెవరన్న ప్రశ్నకూ టీమ్ మేనేజ్ మెంట్ వద్ద ప్రస్తుతానికి సమాధానం లేదు. జట్టులోని ఆటగాళ్లలో ఇమ్రాన్ ఖాన్, పీయుష్ చావ్లా, కరణ్ శర్మ, రవీంద్ర జడేజా, మిచెల్ శాంట్ నర్, కేదార్ జాదవ్ వంటి స్పిన్నర్లు ఉన్నా, వారికెవరికీ హర్భజన్ కు ఉన్న అనుభవం లేకపోవడమే ఇప్పుడు సీఎస్కేను కలవర పరుస్తోంది.