Sasikala: శశికళకు ఆదాయపు పన్ను శాఖ నుంచి షాక్... 65 ఆస్తుల అటాచ్!
- ప్రస్తుతం పరప్పన జైల్లో ఉన్న శశికళ
- 2003 నుంచి 2005 మధ్య అక్రమాస్తులు
- స్వదస్తూరితో రాసిన లేఖ అధికారుల వద్ద
జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై, ప్రస్తుతం బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళకు, ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఆమెకు చెందిన రూ. 300 కోట్ల నగదుతో పాటు, 65 ఆస్తులను అటాచ్ చేసింది. అమె పలు షెల్ కంపెనీల ద్వారా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుని, వాటి ద్వారా కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ గుర్తించింది. ముఖ్యంగా 1995, మార్చి 9న 'శ్రీ హరి చందన ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్' పేరిట ఏర్పాటు చేసిన కంపెనీ లావాదేవీలన్నీ అక్రమమేనని గుర్తించింది.
హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఈ సంస్థ, 2003 నుంచి 2005 మధ్య దాదాపు 200 ఎకరాలను కొందని వెల్లడించిన ఐటీ శాఖ, ఇదే తరహాలో శశికళ 65 ఆస్తులను కూడబెట్టారని, ఈ విషయంలో ఆమెకు పలుమార్లు నోటీసులు కూడా పంపామని పేర్కొంది. ఇక పెద్ద నోట్లను రద్దు చేసిన సమయంలో రూ.1,674 కోట్ల విలువైన స్థిరాస్తుల కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను తెలుపుతూ శశికళ, తన బంధువులకు లేఖ రాసిందని ఐటీ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
తమ వద్ద పెద్ద ఎత్తున మిగిలిపోయిన రూ. 500, రూ. 1000 నోట్లను మార్చుకుంటూ, ఈ ఆస్తులను ఆమె కొనుగోలు చేయించిందని, మరో రూ. 237 కోట్లను పౌష్టికాహార పథకం కాంట్రాక్టరుకు రుణంగా ఇచ్చారని, తమ విచారణలో ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలూ లభ్యమయ్యాయని ఐటీ అధికారులు ప్రకటించారు. శశికళ రాసిన లేఖ తమకు ఇళవరసి కుమారుడు వివేక్ జయరామన్ ఇంట్లో తనిఖీలు చేసిన వేళ దొరికిందని, ఇది శశికళ తన స్వదస్తూరితో రాసిందేనని గుర్తించామని అధికారులు తెలిపారు.
ఈ లేఖను ఎవరిచ్చారని ప్రశ్నించగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి వాచ్ మెన్ కు ఇచ్చి వెళ్లారని వివేక్ తమకు తెలిపాడని అధికారులు తెలిపారు. ఇక, ఈ లెటర్ ను ఎందుకు దాచావని ప్రశ్నించగా, ఇందులోని వివరాలపై శశికళను కలిసినప్పుడు, లేదా ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని భావించి, దాచి పెట్టానని ఆయన తెలిపినట్టు సమాచారం. అయితే, ఈ లేఖ వచ్చిన నెల రోజుల తరువాత అది తమకు లభ్యమైందని, ఈలోగా వివేక్, శశికళతో మాట్లాడలేదని గుర్తించామని అధికారులు వెల్లడించడం గమనార్హం.