Sonia Gandhi: ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు లేఖ రాసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ
- తీవ్ర అనారోగ్యంతో ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
- దిగ్భ్రాంతికి లోనయ్యామన్న సోనియా
- ప్రణబ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మరణం కాంగ్రెస్ వర్గాలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రణబ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తన సందేశం వెలువరించారు. ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠకు లేఖ రాశారు.
"మీ తండ్రి గారు కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు అనుకున్నాం, కానీ ఆయన ఇక లేరన్న వార్త మమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఐదు దశాబ్దాలకు పైగా ప్రణబ్ జాతి ప్రస్థానంలో కానీ, కాంగ్రెస్ పార్టీలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ విడదీయరాని భాగం అయ్యారు. ఆయన మేధాశక్తి తోడు లేకుండా ఇప్పుడు మేం ఎలా మనుగడ సాగించగలమో ఊహించలేకపోతున్నాం. ఆయన అనుభవం, నిష్కల్మషమైన సలహాలు, లోతైన అవగాహన శక్తి వంటి అనేక అంశాలతో ప్రణబ్ ఇప్పటివరకు మాకు తోడుగా ఉన్నారు.
ఆయన తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ వ్యక్తులతో సత్సంబంధాలు కొనసాగించారు. ఆయన జీవితంలో గత 50 ఏళ్లను తీసుకుంటే, ఆ కాలావధి 50 ఏళ్ల దేశ చరిత్రకు దర్పణంలా నిలిచిపోతుంది. క్రియాశీల రాజకీయనాయకుడిగా, కేబినెట్ మంత్రిగా, రాష్ట్రపతిగా అనేక ఘట్టాలకు ఓ రూపునివ్వడంలో ఆయన పాత్ర అమోఘం. నాకు వ్యక్తిగతంగానూ ప్రణబ్ తో ఎంతో సుహృద్భావ జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను.
కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీవ్రంగా శోకిస్తోంది. ఆయన జ్ఞాపకాలు కాంగ్రెస్ పార్టీ హృదయంలో చిరస్మరణీయంగా ఉంటాయి. ఈ విషాద సమయంలో మీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలపుకుంటున్నాను. ఆయన తన అనారోగ్యం నుంచి విముక్తులయ్యారని భావిస్తాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక" అంటూ సోనియా తన లేఖలో పేర్కొన్నారు.