Pranab Mukherjee: ప్రణబ్ ముఖర్జీ మరణంపై సీఎం జగన్, చంద్రబాబు, పవన్ స్పందన
- ఆర్మీ ఆసుపత్రిలో కన్నుమూసిన ప్రణబ్
- ప్రణబ్ మృతి దురదృష్టకరమన్న సీఎం జగన్
- ప్రణబ్ ప్రస్థానం చిరస్మరణీయం అంటూ వ్యాఖ్యలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సాయంత్రం ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రణబ్ మరణంపై ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. "ప్రణబ్ ముఖర్జీ మృతి దురదృష్టకరం. ఈ విషాద ఘటన జాతికి తీరని లోటు వంటిది. ప్రణబ్ ఐదు దశాబ్దాలకు పైగా దేశాభివృద్ధి కోసం వెలకట్టలేని సేవలు అందించారు. గర్వించదగ్గ రీతిలో ఆదర్శప్రాయమైన ఆయన ప్రస్థానం చిరస్మరణీయం. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రణబ్ మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుకుంటున్నాను" అని పేర్కొన్నారు.
చాలా బాధగా ఉంది... చంద్రబాబు సంతాపం
ప్రణబ్ ముఖర్జీ గారు పోయారన్న వార్త విని ఎంతో బాధపడ్డానని టీడీపీ చీఫ్ చంద్రబాబు తెలిపారు. దేశం ఒక అసాధారణమైన రాజనీతి కోవిదుడ్ని కోల్పోయిందని పేర్కొన్నారు. ప్రణబ్ సర్వజ్ఞుడైన వ్యూహకర్త అని, క్రమశిక్షణ, హుందాతనం మూర్తీభవించిన వ్యక్తి అని కొనియాడారు. సిద్ధాంతాలకు కట్టుబడిన మనిషి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రణబ్ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: పవన్
మాజీ రాష్ట్రప్రతి ప్రణబ్ ముఖర్జీ మరణవార్త తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజకీయాల్లో విలక్షణమైన ధ్రువతార అని, రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలను మరిచిపోలేదని వివరించారు. తన పండిట్ల కుటుంబ పరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయాన్ని అనుసరించి పండుగ దినాల్లో ఆ సంప్రదాయాన్ని అనుసరించడం విశేషం అని తెలిపారు. ఈ విలక్షణతను తానెంతో అభిమానిస్తానని పవన్ వెల్లడించారు. ప్రణబ్ రాజకీయ జీవితం భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమని ఉద్ఘాటించారు.