Chandrababu: ఓం ప్రతాప్‌ ఫోన్‌కాల్‌ జాబితాను పోలీసులు బయటపెట్టాలి: చంద్రబాబు

chandrababu fires on ap govt

  • మా పార్టీ కోరడం వల్లే ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష 
  • హడావుడిగా అంత్యక్రియలు జరపడం  తప్పు
  • రహస్యంగా శవపరీక్ష జరపడం మరో తప్పు
  • మృతుడి సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులే తీసుకున్నారు

సోమల మండలం పెద్దకాడ హరిజనవాడలో మృతి చెందిన దళిత యువకుడు ఓం ప్రతాప్‌ (28) ఘటనపై  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కోరడం వల్లే ఓం ప్రతాప్‌ మృతదేహానికి శవపరీక్ష చేశారని ఆయన చెప్పారు. ఈ రోజు తమ పార్టీ దళిత నేతలతో ఆయన వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు.

ఆయన మృతదేహానికి హడావుడిగా అంత్యక్రియలు జరపడం  తప్పని, అలాగే, రహస్యంగా శవపరీక్ష జరపడం మరో తప్పని చంద్రబాబు అన్నారు. మృతుడి సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులే తీసుకున్నారని, ఈ కేసులో ఎలాంటి అవకతవకలు లేకపోతే ఈ పని ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు.

ఓం ప్రతాప్‌ ఫోన్‌కాల్‌ జాబితాను పోలీసులు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బెదిరింపులతో జరిగిన నేరాన్ని దాచాలని కొందరు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. చిత్తూరులో దళితులపై దాడులకు పెద్దిరెడ్డే కారణమని ఆయన అన్నారు.

ఏపీలో చోటు చేసుకుంటోన్న శిరోముండనాల ఘటనలు మానవత్వానికి సిగ్గు చేటని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలో గతంలో జరిగిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపి వుంటే, మళ్లీ ఇప్పుడు విశాఖలో జరగకపోయేదని ఆయన చెప్పారు. శిరోముండనాల కేసులకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. సీఎం‌ అండతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News