Acharya: చిరంజీవి 'ఆచార్య' కథపై ఆరోపణలు... స్పష్టతనిచ్చిన చిత్ర యూనిట్
- 'ఆచార్య' సినిమా కథ తమదేనంటున్న ఇద్దరు రచయితలు
- ఇది ఒరిజినల్ కథ అంటూ స్పష్టం చేసిన చిత్ర యూనిట్
- కొరటాల శివను అప్రదిష్ఠ పాల్జేయడం సరికాదంటూ హితవు
- ఊహాగానాల ఆధారంగానే ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' చిత్రం వివాదాల్లో చిక్కుకోవడం తెలిసిందే. 'ఆచార్య' చిత్ర కథ తమదేనంటూ కన్నెగంటి అనిల్ కృష్ణ, రాజేశ్ మండూరి అనే ఇద్దరు రచయితలు వేర్వేరుగా ఆరోపణలు చేశారు. దీనిపై 'ఆచార్య' చిత్ర యూనిట్ ప్రకటన జారీ చేసింది. 'ఆచార్య' సినిమాను కొరటాల శివ తయారుచేసిన ఒరిజినల్ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నామని ఆ ప్రకటనలో వెల్లడించింది. 'ఆచార్య' సినిమా కథ కాపీ కొట్టారంటూ వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
"ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా ఇటీవలే చిరంజీవి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశాం. దీనికి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభించింది. 'ఆచార్య' సినిమాపై హైప్ ఆకాశాన్నంటుతున్న తరుణంలో ఇద్దరు రచయితలు ఈ సినిమా స్టోరీకి సంబంధించి అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి మేం 'ఆచార్య' సినిమా కథను ఎంతో గోప్యంగా ఉంచాం. యూనిట్లో కూడా ఈ చిత్ర కథ తెలిసినవాళ్లు అతి కొద్దిమంది మాత్రమే.
ఈ నేపథ్యంలో మేం విడుదల చేసిన మోషన్ పోస్టర్ ను చూసి ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మేం స్పష్టం చేయదలచుకుంది ఏమిటంటే... ఇది ఒక ఒరిజనల్ కథ. కొరటాల శివ వంటి ప్రముఖ ఫిలింమేకర్ ను అప్రదిష్ఠ పాల్జేయడం ఆమోదయోగ్యం కాదు. ఈ ఆరోపణలన్నీ కూడా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఆచార్య చిత్ర కథపై వస్తున్న ఊహాగానాలను ఆధారంగా చేస్తున్నవేనని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాకు సంబంధించి వచ్చే ఏ ఆరోపణ అయినా పూర్తిగా నిరాధారం, అవన్నీ కూడా కల్పిత కథల ఆధారంగా పుట్టుకొచ్చినవే అయ్యుంటాయి" అంటూ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. 'ఆచార్య' చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పణలో మాటినీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు.