Adilabad District: నాకు కరోనా లేదు.. వచ్చి కూరగాయలు కొనుక్కోండి: కరోనా నెగటివ్ రిపోర్టుతో వ్యాపారి భరోసా
- ఆదిలాబాద్ జిల్లా పాత ఉట్నూరు వ్యాపారి వినూత్న ఆలోచన
- నెగటివ్ వచ్చిన సర్టిఫికెట్‌కు ఫ్రేమ్ కట్టించి దుకాణంలో పెట్టిన వ్యాపారి
- వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం
ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలు అడుగు తీసి అడుగు బయటపెట్టేందుకు భయపడుతున్నారు. వైరస్ సోకిందెవరికో, లేనిదెవరికో తెలియక అయోమయం చెందుతున్నారు. కొందరికి వైరస్ సోకినప్పటికీ లక్షణాలు బయటకు కనిపించకపోవడం ఇందుకు కారణం. దీంతో కూరగాయలు వంటి వాటిని కొనుగోలు చేసే సమయంలో ప్రజలు భయంభయంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుకు చెందిన ఓ కూరగాయల వ్యాపారి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. పాత ఉట్నూరుకు చెందిన వ్యాపారి డోలి శంకర్ మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్ష చేయించుకున్నాడు. కరోనా నెగటివ్ అని నిర్ధారణ కావడంతో వైద్యులు ఇచ్చిన ఆ ధ్రువపత్రాన్ని ప్రేమ్ కట్టించి తన కూరగాయల దుకాణంలో అందరికీ కనిపించేలా పెట్టాడు. తనకు కరోనా లేదని, తన వద్ద అందరూ నిరభ్యంతరంగా కూరగాయలు కొనుగోలు చేసుకోవచ్చని వినియోగదారులకు భరోసా కల్పిస్తున్నాడు.