TATA Sons: 'సూపర్ యాప్'ను సిద్ధం చేస్తున్న టాటా... రిలయన్స్, అమెజాన్ పై పోటీకే!

Tata Sons Making Super App to Take RIL and Amazon

  • గుండు సూది నుంచి కారు వరకూ ఒకే వేదికపై
  • డిసెంబర్ లేదా జనవరిలో విడుదల
  • దాదాపు రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టనున్న టాటా సన్స్
  • ఇప్పటికే టాటాకు దేశవ్యాప్తంగా కస్టమర్లు

రిలయన్స్, అమెజాన్ లకు దీటుగా ఉంటూ, గుండుసూది నుంచి కారు వరకూ కావాల్సిన దేన్నయినా ఆర్డర్ చేసుకునేలా టాటా గ్రూప్ ఓ సూపర్ యాప్ ను అభివృద్ధి చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.  ఈ యాప్ ను డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం ఆరంభంలో టాటా గ్రూప్ విడుదల చేస్తుందని తెలుస్తోంది. ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్ వాణిజ్యంలో తమదైన ప్రభావాన్ని చూపేందుకు ఇప్పటికే అమెజాన్, రిలయన్స్ ప్రయత్నిస్తుండగా, అందివచ్చే అవకాశాన్ని వినియోగించుకోవాలని టాటా గ్రూప్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాలు, ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, గృహోపకరణాలు, బీమా,ఆర్థిక ఉత్పత్తులు, హెల్త్ కేర్, వివిధ రకాల బిల్ చెల్లింపులు తదితరాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చేలా ఈ యాప్ ఉండాలని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, సంస్థ ఐటీ విభాగం తీవ్రంగా కృషిచేస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే 113 బిలియన్ డాలర్ల విలువైన గ్రూప్ గా ఉన్న టాటా సన్స్, ఈ సూపర్ యాప్ తో మరింత పెద్ద అవకాశాలను అందుకోవాలని ఆయన భావిస్తున్నారని 'ఫైనాన్షియల్ టైమ్స్' పత్రిక ప్రత్యేక కథానాన్ని ప్రచురించింది.

నిన్న మొన్నటి వరకూ కేవలం చమురు రంగానికే అధికంగా పరిమితమైన రిలయన్స్, ఈ-కామర్స్, టెలికం రంగాల్లోకి ప్రవేశించి, 20 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించి, తన వ్యాపారాన్ని విస్తరించిన వేళ, 2030 నాటికి ఆన్ లైన్ రిటైల్ విభాగం భారత జీడీపీలో 2.5 శాతం వాటా వరకూ... అంటే 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని వెలువడుతున్న అంచనాల నేపథ్యంలో, ఇండియాలో కోట్లాది కస్టమర్లను కలిగివున్న టాటా గ్రూప్, డిజిటల్ సేవల్లోకి సైతం ప్రవేశించాలని భావిస్తోంది.

కాగా, ప్రస్తుతానికి టాటా గ్రూప్ రూపొందిస్తున్న ఈ సూపర్ యాప్ గురించిన మరింత సమాచారం అందుబాటులో లేదు. అయితే, టాటా సంస్థ 'క్లిక్' పేరిట ఓ ఫ్యాషన్ షాపింగ్ యాప్ ను నడిపిస్తోంది. ఇదే సంస్థ ఈ-స్టోర్ గా 'స్టార్ క్లిక్'ను ఎలక్ట్రానిక్స్ ప్లాట్ ఫామ్ గా క్రోమా రిటైల్ చైన్ ను నిర్వహిస్తోంది. గత సంవత్సరం డిజిటల్ బిజినెస్ ను ప్రారంభించి, ఉప్పు నుంచి సాఫ్ట్ వేర్ వరకూ విస్తరించిన టాటా, ఈ యాప్ పై రూ.1000 కోట్ల వరకూ ఖర్చు పెట్టడం ద్వారా విస్తరణ ప్రణాళికలను అభివృద్ధి చేసేందుకు యోచిస్తున్నట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని సంస్థ వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News