Kadapa District: ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను ఇంట్లో సీఐడీ సోదాలు.. కళ్లు చెదిరే నగదు, ఆభరణాల స్వాధీనం
- నిన్న ఏకకాలంలో ఏడు బృందాల దాడులు
- ఖాజీపేట, హిమాయత్‌నగర్‌లలో విస్తృత తనిఖీలు
- రూ. కోటికిపైగా నగదు, దాదాపు 3 కిలోల బంగారు ఆభరణాల స్వాధీనం
కడప జిల్లాకు చెందిన ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను నివాసంలో సీఐడీ అధికారులు నిన్న జరిపిన సోదాల్లో కళ్లు చెదిరే నగదు, బంగారు, వెండి ఆభరణాలు బయటపడ్డాయి. కడప జిల్లా ఖాజీపేటతోపాటు హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న ఆయన ఇళ్లు, పలువురు సొసైటీల అధ్యక్షుల ఇళ్లలో సీఐడీకి చెందిన ఏడు బృందాలు ఏక కాలంలో దాడులు నిర్వహించాయి. ఈ సందర్భంగా కోటి రూపాయలకు పైగా నగదు, 2.968 కిలోల బంగారు, 1.859 కిలోల వెండి ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
2016లో ఆప్కో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీను పలు అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఆప్కో ద్వారా పాఠశాలల విద్యార్థులు, పోలీసు శాఖతోపాటు వివిధ శాఖలకు చేనేత వస్త్రాలు సరఫరా చేసే కార్యక్రమంలో భాగంగా, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న పవర్‌లూమ్ వస్త్రాలను పంపి అక్రమాలకు పాల్పడ్డారని, బోగస్ సొసైటీలు స్థాపించి ప్రభుత్వ సబ్సిడీని జేబుల్లో వేసుకున్నారని, కోట్లాది రూపాయలు అలా దండుకున్నారన్న ఆరోపణలున్నట్టు డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు.