Unlock 4.0: 'అన్ లాక్ 4.0'లో సినీ అభిమానులకు శుభవార్త ఖాయం!
- పది రోజుల్లో ముగియనున్న మూడో దశ అన్ లాక్
- సెప్టెంబర్ 1 నుంచి నాలుగో దశ మొదలు
- సినిమా హాల్స్ కు అనుమతించే యోచనలో కేంద్రం
- కొవిడ్ నిబంధనల అమలు తప్పనిసరి
మరో పది రోజుల్లో మూడో దశ అన్ లాక్ పూర్తయిపోతుంది. ఆపై నాలుగో దశ అన్ లాక్ లో ఏఏ రంగాలకు అనుమతి ఇవ్వాలన్న విషయమై కేంద్రం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేసినట్టు తెలుస్తోంది. మూడు దశల అన్ లాక్ లో భాగంగా ప్రజా రవాణా,మాల్స్, జిమ్, యోగా కేంద్రాలు, రెస్టారెంట్లకు అనుమతి ఇచ్చిన కేంద్రం, సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే నాలుగో దశలో సినిమాహాళ్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
కాగా, ఐదు నెలలుగా సినిమా హాళ్లు మూతపడివున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యలో తాము హాల్స్ లో సీటింగ్ నిర్మాణాన్ని మారుస్తామని, అన్ని నిబంధనలను పాటిస్తామని, సినిమా థియేటర్లను తెరచుకునేందుకు అనుమతించాలని పలు మూవీ చెయిన్ సంస్థలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. అయినా కేంద్రం అనుమతించలేదు. ఇక తాజాగా భౌతిక దూరం, శానిటైజేషన్ నిబంధనలను పాటిస్తూ, మూవీ థియేటర్లను ప్రారంభించేందుకు కేంద్రం అతి త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనుందని సమాచారం.
హాళ్లలో ఏసీ 24 డిగ్రీలకు తగ్గకుండా చూడటంతో పాటు, సినిమా చూస్తున్నంత సేపూ మాస్క్ తప్పనిసరి చేయాలని కేంద్రం నుంచి హాల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు అందాయని తెలుస్తోంది. ప్రతి సినిమా ప్రదర్శన అనంతరం, హాలంతా శానిటైజ్ తప్పనిసరని, ఈ బాధ్యత యాజమాన్యాలదేనని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సినిమా హాల్స్ తిరిగి తెరిచేందుకు పాటించాల్సిన విధివిధానాలను విడుదల చేసేందుకు కేంద్రం సిద్ధమైనట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.