India: చైనా మరో దుందుడుకు చర్య... సరిహద్దుల్లోకి జే-20 స్టెల్త్ విమానాల తరలింపు!

China Fighter Jets to LAC

  • ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలోనే విమానాలు
  • రాడార్లను ఏమార్చగల జే-20 ఫైటర్ జెట్స్
  • సరిహద్దుల్లో రెండు దేశాల వైపునా దాదాపు లక్ష మంది సైన్యం

ఇప్పటికే వాస్తవాధీన రేఖ వెంబడి ఇండియా పరిధిలోని భూమిని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తూ, రెచ్చగొడుతున్న చైనా, ఓ వైపు శాంతి మాటలు చెబుతూనే, మరోవైపు మరింత సైనిక బలగాలను సరిహద్దుల్లోకి తరలిస్తోంది. సరిహద్దులకు చాలా దగ్గరగా ఉన్న వైమానిక స్థావరానికి అత్యాధునిక జే-20 స్టెల్త్ యుద్ధ విమానాలను మోహరించింది. ఎల్ఏసీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న హోటన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి ఇప్పటికే జే-10, జే-11 విమానాలను పంపిన చైనా, వాటికి తోడుగా జే-20లను, జే-8, జే-16లను కూడా పంపింది.

ఒకవేళ ఇండియాతో యుద్ధం చేయాల్సి వస్తే, ముందుగా సైన్యాన్ని పంపకుండా, విమానాల ద్వారా క్షిపణులు, డ్రోన్లను వినియోగించాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎల్ఏసీ సమీపంలో బలగాలను పెంచుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జే-20 ఫైటర్ జెట్ లను చైనాకే చెందిన చెంగ్డూ కంపెనీ తయారు చేసింది. ఇవి జే సీరీస్ లో ఫిఫ్త్ జనరేషన్ కు చెందినవి. మరో 20 ఏళ్ల పాటు ఇవి అన్ని రకాల యుద్ధాల్లోనూ చైనా సైన్యానికి వెన్నుదన్నుగా నిలుస్తాయని అంచనా. రాడార్లను ఏమార్చి మరీ దాడులు చేసే సామర్థ్యం వీటి సొంతం. వీటిల్లో రష్యాకు చెందిన ఏఎల్-31 ఇంజన్ ఉంటుంది. ఈ తరహా విమానాలు చైనా వద్ద కనీసం 30 వరకూ ఉంటాయని అంచనా.

ఇదే సమయంలో ఇండియా కూడా సరిహద్దులకు మరిన్ని యుద్ధ విమానాలను పంపింది. లేహ్ వైమానిక స్థావరంలో సుఖోయ్-30, మిగ్ 29కేలతో పాటు సీ-17 రవాణా విమానాలు, నిఘా విమానమైన పీ-8ఐ, అపాచీ, చినూక్ హెలికాప్టర్లతో పాటు డ్రోన్లను మోహరించింది. మొత్తం మీద రెండు దేశాలూ కలిపి దాదాపు లక్ష మంది సైనికులను సరిహద్దులకు తరలించడంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.

  • Loading...

More Telugu News