CBI: చనిపోయేలోగా ప్రతి మనిషి ఈ నాలుగు నిర్వర్తించాలి: సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ

Giving to the society is the original life says VV Lakshminarayana

  • ఇతరులకు సహాయం చేయడమే అసలైన జీవితం
  • సమాజానికి ఇచ్చిన వారి విగ్రహాలనే ఎక్కడైనా ఏర్పాటు చేస్తారు
  • మన యువత ఆత్మ నిర్భరం చేసుకుంటే భారత్ ఎదుగుతుంది

ఎంతో మంది ప్రాణత్యాగం చేసి అందించిన స్వేచ్ఛను మనమందరం ఇప్పుడు అనుభవిస్తున్నామని సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ చెప్పారు. ఎందరో త్యాగాలతో స్వాతంత్ర్యం పొందిన ఈ దేశంలో గాలి పీల్చడం మన అదృష్టమని అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద సేవా సంస్థ చేతన ఫౌండేషన్ ఈరోజు గాయకుడు జాన్ కు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. జూమ్ యాప్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమానికి లక్ష్మీనారాయణ, సినీ కవి సుద్దాల అశోక్, గాయకుడు జాన్ తో పాటు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు.

పాట మనిషిని, మనసును కదిలిస్తుందని... గాయకుడు జాన్ పాడిన పాటలు ఎందరినో కదిలించాయని, తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రభావితం చూపించాయని లక్ష్మీనారాయణ చెప్పారు. మనిషిని ద్రవింపజేసి, ప్రవహింపజేయడం చాలా ముఖ్యమని అన్నారు. ఒక కవికి, ఒక గాయకుడికి ఇది సాధ్యమవుతుందని తెలిపారు. అలాంటి కవి అశోక్ తేజ ఈ కార్యక్రమంలో ఉండటం, అలాంటి గాయకుడు జాన్ ను సత్కరించుకోవడం సంతోషకరమని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయమని అన్నారు.

ఇతరులకు సహాయం చేయడమే అసలైన జీవితమని లక్ష్మీనారాయణ చెప్పారు. మనం రోడ్లపై విగ్రహాలు చూస్తుంటామని... అవన్నీ సమాజానికి ఇచ్చిన వారి విగ్రహాలని, సమాజం నుంచి తీసుకున్నవారివి కాదని అన్నారు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అధినేతగానే ఉండి ఉంటే ఆయన విగ్రహాన్ని ఎప్పటికీ పెట్టేవారు కాదని...ఆయన మిలిందా గేట్స్ ఫౌండేషన్ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా సేవ చేయడం ప్రారంభించిన తర్వాతే ఆయనకు ఎంతో గొప్ప పేరు వచ్చిందని చెప్పారు. ఏదో ఒకరోజు ఆయనకు కూడా విగ్రహం పెడతారని అన్నారు.

సమాజానికి సాయం చేసిన వారే బతికినవారని.. సాయం చేయని వారు చనిపోయినవారితో సమానమని స్వామి వివేకానంద చెప్పారని తెలిపారు. సమాజం ఎదగాలంటే ప్రతి ఒక్కరూ సామాజానికి ఎంతో కొంత ఇవ్వాలని చెప్పారు. మనిషి చనిపోయేలోపల నాలుగు ధర్మాలను నిర్వర్తించాలని... అవి వ్యక్తి ధర్మం, వృత్తి ధర్మం, సామూహిక ధర్మం, సామాజిక ధర్మమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ నాలుగు ధర్మాలను నిర్వర్తిస్తే సమాజ విస్తృతి మరింత పెరుగుతుందని అన్నారు. సమాజ స్థాయిని పెంచేందుకు చేతన ఫౌండేషన్ ఎంతో చేస్తోందని కితాబిచ్చారు. సమాజ స్థాయిని పెంచేందుకు తన గళాన్ని వినిపిస్తున్న గొప్ప వ్యక్తి జాన్ అని చెప్పారు.

భారత్ ను ఆత్మనిర్భర్ గా చేసేందుకు ప్రధాని మోదీ సంకల్పించారని... ఏ దేశంలో అయితే యువత ఎక్కువగా ఉంటుందో... ఆ దేశ భవిష్యత్తును సులభంగా మార్చవచ్చని చెప్పారు. 65 శాతం యువత ఉన్న భారత్ ఒక సంకల్పం చేసుకుంటే... ప్రపంచమంతా మన వైపు చూసే విధంగా ఎదగొచ్చని అన్నారు. ఇది సాధించాలంటే తొలుత మనమంతా ఆత్మనిర్భరం చేసుకోవాలని సూచించారు. నేను ఒక వ్యక్తిగా ఎలా ఎదగగలను, నా ఇంటిని ఎలా పెంపొందించగలను, నా సమాజాన్ని ఎలా ఆత్మనిర్భరం చేయగలను, ఆ తర్వాత దేశం స్వయంశక్తిగా ఎలా ముందుకు వెళ్తుంది? అనే విషయాలపై ఆలోచించాలని చెప్పారు. మనిషి క్రియేటివ్ గా ఆలోచించాలని సూచించారు. సుద్దాల అశోక్, జాన్ వంటి కళాకారుల మాదిరి ప్రతి ఒక్కరూ సృజనాత్మకశక్తిని వెలికి తీయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News