Guntur CCS: గుంటూరు సీసీఎస్ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
- గత అక్టోబర్ లో ముగ్గురుని నిర్బంధించిన సీసీఎస్ పోలీసులు
- హైకోర్టును ఆశ్రయించిన కుటుంబసభ్యులు
- సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
గుంటూరు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులపై సీబీఐ కేసు నమోదైంది. ముగ్గురు వ్యక్తులను అక్రమంగా 10 రోజుల పాటు నిర్బంధించారనే అభియోగాలపై కేసును సీబీఐ అధికారులు నమోదు చేశారు. రాయిడి శ్రీనివాసరావు, తూమటి శ్రీనివాసరావు, నలబోలు ఆదినారాయణలను 2019 అక్టోబర్ లో గుంటూరు సీసీఎస్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో వారి కుటుంబసభ్యులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ బ్రాంచ్ ఎస్పీ ఎంఎస్ ఖాన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుంటూరు సీసీఎస్ పీఎస్ ఇన్స్ పెక్టర్ వెంకటరావు, హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు, కానిస్టేబుల్ వీరాంజనేయులుతో పాటు అదే స్టేషన్ కు చెందిన మరికొందరిని ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చారు. ఐపీసీ 120 బీ, 344, 348 సెక్షన్ల కింద వారిపై అభియోగాలను నమోదు చేశారు.