Pranab Mukherjee: ఇక నా తండ్రి భారం ఆ భగవంతుడిదే!: ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠ

Sharmishtha Mukharjee on Twitter called God Only Can Save My Fathers Life

  • మరింత విషమమైన ప్రణబ్ ఆరోగ్య స్థితి
  • ఏడాది క్రితం ఆయన భారత రత్న అందుకున్నారు
  • కష్టాలను, సంతోషాన్ని సమానంగా తీసుకునే ధైర్యం నాకు కావాలి
  • ట్విట్టర్ లో శర్మిష్ఠా ముఖర్జీ

బ్రెయిన్ సర్జరీ తరువాత ఆసుపత్రిలో విషమ ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొంటున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కోలుకోవాలని పలువురు ప్రముఖులు కోరుకుంటున్న వేళ, ఆయన కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ట్వీట్ వైరల్ అయింది. ప్రస్తుతం ప్రణబ్, న్యూఢిల్లీలోని ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

"గత సంవత్సరం ఆగస్టు 8. నా జీవితంలోని ఓ అత్యంత ఆనందకరమైన రోజు. సరిగ్గా సంవత్సరం క్రితం ఆయన భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. ఏడాది తిరిగేసరికి ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఇక నా తండ్రి భారం ఆ దేవుడిదే. తనవంతుగా ఏం చేయాలో ఆ భగవంతుడు అన్నీ చేయాలి. జీవితంలో ఏర్పడే సంతోషాన్ని, కష్టాలను సమానంగా స్వీకరించేలా నాకు బలాన్నివ్వాలి. మాకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని ఆమె ట్వీట్ చేశారు.

కాగా, ప్రణబ్ ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించిందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఆయనకు బ్రెయిన్ సర్జరీ జరిగిన తరువాత, వెంటిలేటర్ పై ఉంచి చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాస్పిటల్ కు వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మరోపక్క ముఖర్జీ స్వగ్రామమైన పశ్చిమ బెంగాల్ లోని గ్రామంలో మహా మృత్యుంజయ హోమాన్ని గ్రామస్థులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 84 ఏళ్ల వయసులో ఇంకోపక్క కరోనాతో కూడా బాధపడుతున్న ప్రణబ్ ముఖర్జీ, తిరిగి కోలుకోవాలని జాతి యావత్తూ ప్రార్థిస్తోంది. 2012 నుంచి 2017 మధ్య ప్రణబ్ భారత రాష్ట్రపతిగా విధులను నిర్వర్తించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News