Kozhikode: కోజికోడ్ విమాన ప్రమాదం.. చనిపోయిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్!

One of deceased passengers of  Kozhikode plane crash tests Corona positive

  • ప్రమాద సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు
  • 18 మంది ప్రయాణికుల మృతి
  • మరో 22 మంది పరిస్థితి విషమం

కోజికోడ్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది చనిపోయారు. వీరిలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలిందని కేరళ మంత్రి కేటీ జలీల్ తెలిపారు. సుధీర్ వర్యాత్ (45) అనే ప్రయాణికుడి శాంపిల్స్ ను టెస్టింగ్ కు పంపగా.. పాజిటివ్ అని తేలిందని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత సహాయక చర్యల్లో పాల్గొన్న వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లాలని కోరారు.

మరోవైపు ప్రమాద స్థలికి చేరుకున్న ఇన్వెస్టిగేషన్ టీమ్... ఆ ప్రాంతం నుంచి డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్ పిట్ వాయిస్ రికార్డర్ లను స్వాధీనం చేసుకుంది. వీటి ఆధారంగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉందని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. వీటిలోని సమాచారాన్ని సేకరించేందుకు వీటిని ఢిల్లీకి పంపుతున్నామని చెప్పారు.

కోజికోడ్ లోని కరిపూర్ ఎయిర్ పోర్టులో విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో విమానంలో క్రూ సిబ్బందితో పాటు 190 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 149 మంది క్షతగాత్రులను కోజికోడ్, మలప్పురం జిల్లాల్లోని ఆసుపత్రుల్లో చేర్చారు. వీరిలో 22 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

  • Error fetching data: Network response was not ok

More Telugu News