India: ఈ ఏడు ఎక్కడికీ వెళ్లేది లేదంటున్న భారతీయులు: ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ సర్వే వివరాలు!

Indians Not Intrested in Travel

  • పర్యాటక రంగాన్ని కుదేలు చేసిన కరోనా
  • పడిపోయిన ప్రజల ట్రావెల్ సెంటిమెంట్
  • విహారాలు వద్దని భావిస్తున్న అత్యధికులు

కరోనా ప్రభావం ప్రపంచ టూరిజం రంగాన్ని కుదేలు చేసిన సంగతి తెలిసిందే. భారత పర్యాటక రంగంపైనా తీవ్ర ప్రభావమే పడింది. వైరస్ వ్యాప్తి భయంతో రైళ్లు నడవక, బస్సులు తిరగని పరిస్థితి నెలకొనగా, ప్రజల ట్రావెల్ సెంటిమెంట్ సైతం మారిపోయింది. ఈ సంవత్సరం సెలవుల్లో కుటుంబాలతో విహారాలకు వెళ్లేది లేదని 43 శాతం మంది వెల్లడించారు. బాట్ ట్రావెల్ సెంటిమెంట్ ట్రాకర్ సర్వే ఓ అధ్యయనం జరిపి, వివరాలను వెల్లడించింది. ఈ సంవత్సరం ప్రయాణాలు చేసేందుకు కేవలం 36 శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు.

గత నెల 1 నుంచి 28 తేదీల మధ్య బాట్ ప్లాట్ ఫామ్ పై 21 సంవత్సరాలు నిండిన 5 వేల మందిని ప్రశ్నించి, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ రిపోర్టును తయారు చేశామని పేర్కొన్న సంస్థ, ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటామని 56 శాతం మంది పేర్కొన్నారని, ఇదే సమయంలో ఏవైనా విహార యాత్రలకు వెళ్లాలంటే, నవంబర్ తరువాతే అనుకూలమని 33 శాతం మంది అభిప్రాయపడ్డారని వెల్లడించింది.

ఇక వీకెండ్ లో మాత్రమే స్నేహితులను కలుస్తున్నామని 39 శాతం మంది వెల్లడించగా, ఉదయం వెళితే, సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తున్నామని, సొంత వాహనాలపైనే వెళుతున్నామని అత్యధికులు పేర్కొన్నారు. అద్దె వాహనాల్లో ప్రయాణిస్తున్నామని 28 శాతం మంది, దూర ప్రయాణాలకు విమానాలను ఎంచుకుంటున్నామని 25 శాతం మంది పేర్కొన్నట్టు బాట్ ట్రావెల్ వెల్లడించింది. ఇక సెలవుల్లో విహారయాత్రలకు వెళితే రూ. 50 వేల నుంచి ఒక లక్ష వరకూ ఖర్చు చేస్తామని 41 శాతం మంది, రెండు లక్షల వరకూ ఖర్చు చేస్తామని 30 శాతం మంది వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్న హోటల్స్, రిసార్టులనే ఎంచుకుంటామని 75 శాతం మంది సర్వేలో పాల్గొన్న వారు చెప్పడం గమనార్హం.

  • Loading...

More Telugu News