LK Advani: ఈ ఉద్వేగభరిత క్షణాల్లో నా నోట మాట రావడం లేదు: ఎల్కే అద్వానీ
- కలనెరవేరే చారిత్రక సమయం ఇది
- రామాలయ నిర్మాణంపై అద్వానీ వీడియో
- నాటి ఉద్యమం నా కర్తవ్య ధర్మమే
- జాతి ఐక్యతకు ఆలయం సూచికన్న అద్వానీ
రామ జన్మభూమి, బీజేపీ... ఈ రెండు పేర్లూ వినగానే గుర్తుకు వచ్చే మరో రెండు పేర్లు... రథయాత్ర, ఎల్కే అద్వానీ. 1980 దశకం చివరి నుంచి 1990 దశకం ప్రారంభం వరకూ రామ్ రథ యాత్ర పేరిట సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ అద్వానీ నేతృత్వంలో జరిగిన యాత్ర, బీజేపీని అధికారంలోకి తీసుకుని వచ్చింది కూడా. ఇది జరిగి దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. నాడు చలాకీగా ఈ యాత్రలో పాల్గొన్న అద్వానీ, ఇప్పుడు బీజేపీ కురువృద్ధుడిగా మారిపోయి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
నాటి తన కల నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నంకాగా, ఎంతో భావోద్వేగంగా స్పందించిన ఆయన, ఇది ఓ చారిత్రక సమయమని వ్యాఖ్యానించారు. భారతావనిలోని ప్రతి హిందువు కలా నెరవేరనుందని అభిప్రాయపడ్డ ఆయన, ఇంతకన్నా తన నోటి వెంట మాటలు రావడం లేదని అన్నారు. ప్రస్తుతం 92 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన, తన హృదయానికి ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉందని, తనకు అక్కడికి వెళ్లాలని కోరికగా ఉన్నా, వెళ్లలేకున్నానని అన్నారు. రామజన్మభూమిలో మందిర నిర్మాణం బీజేపీ కలని, రథయాత్ర ద్వారా ఈ ఉద్యమంలో పాల్గొనడం ద్వారా తన కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తించానని అన్నారు.
కాగా, అయోధ్యలో రామాలయం ఉండాలన్న కోరికను హిందువుల్లోకి బలంగా తీసుకెళ్లిన వారిలో అద్వానీతో పాటు మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, రామాలయం శంకుస్థాపనకు తొలుత వీరిద్దరికీ ఆహ్వానం వెళ్లలేదు. దీంతో రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, చివరకు వీరికి ఫోన్ చేసిన కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. ఆపై అద్వానీ తన వీడియో స్టేట్ మెంట్ ను విడుదల చేస్తూ, భరతజాతి ఐక్యతకు ఈ ఆలయం సూచికగా నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.