ilayaraja: ఇళయరాజా ఇలా చేయడం సరికాదు: నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్
![ilayaraja shoul take complaint on lv prasad grandson says prasad](https://imgd.ap7am.com/thumbnail/cr-tn-cb6d09647ae0.jpg)
- ఎల్వీ ప్రసాద్ మనవడిపై కేసులు పెట్టారు
- ఇళయరాజా వంటి వారు కోర్టుకెళ్లడం సరికాదు
- ఎవరి మాట విని ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు
- ఇళయరాజా కేసును వెనక్కి తీసుకోవాలి
ఎల్వీ ప్రసాద్ మనవడు సాయి ప్రసాద్‌పై సంగీత దర్శకుడు ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సాయి, అతడి అనుచరులు ప్రసాద్ స్టూడియోలోని తన సూట్లోకి ప్రవేశించి సంగీత వాయిద్యాలతో పాటు ఇతర పరికరాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఎల్వీ ప్రసాద్ తనకు స్టూడియోలో ఇచ్చిన ప్రత్యేకమైన గది ఉన్న స్టూడియో స్థలం గురించి వివాదం రాజుకున్న నేపథ్యంలో ఆయన ఈ ఫిర్యాదు చేశారు. అయితే, దీనిపై ప్రముఖ నిర్మాత, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్ స్పందిస్తూ.. ఇళయరాజా తీరుపై మండిపడ్డారు.
ఎల్వీ ప్రసాద్, ఆయన కుటుంబం మూడు తరాలుగా సినీ పరిశ్రమకు సేవ చేస్తోందని కాట్రగడ్డ ప్రసాద్ అన్నారు. అటువంటి వారిపై ఇళయరాజా లాంటి వారు కోర్టుకెళ్లడం సరికాదని ఆయన చెప్పారు. ఇన్వాయిస్ను చూపించి ఇళయరాజా తన వాయిద్య పరికరాలను తీసుకెళ్లారని, మళ్లీ ఇప్పుడు కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. ఇటువంటి పనులను ఆయన ఎవరి మాట విని చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు. ఇళయరాజా వంటి వ్యక్తి ఇటువంటి పనులు చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఇళయరాజా తన కేసును వెనక్కి తీసుకోవాలని ఆయన అన్నారు.