Sujana Chowdary: రాజధాని విషయంలో సుజనా చౌదరి గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం: ఏపీ బీజేపీ శాఖ వివరణ
- రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదన్న సోము వీర్రాజు
- రాజధాని తరలింపులో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఉందన్న సుజనా
- అందుకే రాజధాని రైతులకు పన్ను మినహాయింపని వ్యాఖ్య
- కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్న ఏపీ బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని పలువురు బీజేపీ నేతలు కూడా స్పష్టం చేశారు. అయితే, ఇందుకు విరుద్ధంగా ఈ పార్టీ నేత సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఏపీ రాజధాని తరలింపులో కేంద్ర ప్రభుత్వానికి పాత్ర ఉందని చెప్పారు. అందుకే రాజధాని రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారని తెలిపారు. రాజధాని విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదని అన్నారు. రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర సర్కారుదే తుది నిర్ణయమని, ఇప్పటికే అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్ ఇండియా కూడా గుర్తించిందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుందని సుజనాచౌదరి చెప్పారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. రాజధానిపై గత 70 ఏళ్లలో ఎన్నడూ జరగని గందరగోళం జరుగుతోందని తెలిపారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలను తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఏపీ బీజేపీ కీలక వ్యాఖ్యలు చేసింది.
'రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందన్న బీజేపీ ఎంపీ సుజనాచౌదరి గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం. రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బీజేపీ విధానంగా అధ్యక్షులు సోము వీర్రాజు గారు స్పష్టం చేశారు' అని పేర్కొంది.