Rahul Gandhi: మోదీపై విమర్శల విషయంలో... రాహుల్ కు కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్!

Rahul has to take charge of Cogress suggests Sharad Pawar

  • మోదీ వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికి ప్రాధాన్యతను ఇస్తున్నారన్న రాహుల్
  • ఇక వ్యక్తిని టార్గెట్ చేయడం సరి కాదన్న పవార్
  • కాంగ్రెస్ పగ్గాలను రాహుల్ చేపట్టాలని సూచన

ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పలు అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే సమయంలో రాహుల్ కు ఊహించని విధంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ భాగస్వామి అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చురకలు అంటించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ఉన్నాయనే ప్రచారం జోరుగా జరుగుతున్న తరుణంలో పవార్ వ్యాఖ్యలు వేడిని పుట్టిస్తున్నాయి.

మోదీ తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికే  ప్రాధాన్యతను ఇస్తున్నారన్న రాహుల్ వ్యాఖ్యలకు పవార్ కౌంటర్ ఇచ్చారు. అది రాహుల్ వ్యక్తిగత అభిప్రాయం కావచ్చని పవార్ అన్నారు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే... అతని విశ్వసనీయత తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరిస్థితిని రాహుల్ నివారించాలని హితవు పలికారు. ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర కామెంట్లు కూడా చేశారు.

ఎవరు ఔనన్నా, కాదన్నా కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబమే ఆధారమని పవార్ చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా తను కాంగ్రెస్ పార్టీని చూస్తున్నానని... రాజీవ్ గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని ఒక్క తాటిపైకి తీసుకురావడంలో సోనియాగాంధీ విజయవంతమయ్యారని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ కేడర్ ఒప్పుకుంటుందని... అయితే, అది ఆ పార్టీ అంతర్గత విషయమని చెప్పారు. రాహుల్ కు పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలను అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ పగ్గాలను రాహుల్ వెంటనే చేపట్టాలని పవార్ సూచించారు. దేశ వ్యాప్తంగా రాహుల్ పర్యటించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. కార్యకర్తలు, నాయకులను రాహుల్ కలుసుకోవాలని సూచించారు. ఇదే పనిని రాహుల్ కొన్ని సంవత్సరాల క్రితం చేశారని... ఇప్పుడు మరోసారి ఆ పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News