Youth: పెళ్లికి ముందే బట్టతల వస్తోందని... వరంగల్ యువకుడి బలవన్మరణం
- హైదరాబాదులో క్యాటరింగ్ పనులు చేస్తున్న నితిన్
- లాక్ డౌన్ తో నిలిచిన ఉపాధి
- ఆర్థిక ఇబ్బందులతో సతమతం
వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన నితిన్ అనే యువకుడు పెళ్లికి ముందే బట్టతల వస్తోందన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడడం అతని కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. నితిన్ హైదరాబాదులో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసేవాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి ఉప్పల్ లో నివాసం ఉంటున్న నితిన్ తన ఆదాయంలోనే కొంత తల్లిదండ్రులకు కూడా పంపేవాడు.
ఇదిలావుంచితే, ఇటీవల అతనికి జుట్టు బాగా రాలిపోతోంది. దాంతో పెళ్లికి ముందే జుట్టంతా ఊడిపోతే ఎలా అని భావించి, హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం కొంత డబ్బు పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అయితే లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో డబ్బు సంపాదన నిలిచిపోయింది. దానికితోడు సోదరి పెళ్లికి డబ్బు పంపాలని ఇంటి నుంచి సమాచారం వచ్చింది.
ఈ నేపథ్యంలో, తీవ్ర మనస్తాపం చెందిన నితిన్ స్నేహితులు గదిలో లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ కారణం కాదని, పెళ్లి కాకముందే జుట్టంతా రాలిపోతోందన్న ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.