Yuvraj Singh: నా కెరీర్ ముగింపు సమయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉంది: యువరాజ్ సింగ్

Yuvraj on retirement and asked BCCI give proper recognition for who played a long spell

  • వీడ్కోలు మ్యాచ్ లేకుండానే ముగిసిన యువీ కెరీర్
  • సుదీర్ఘకాలం సేవలు అందించిన ఆటగాళ్లను గౌరవించాలన్న యువీ
  • బీసీసీఐ వైఖరిలో మార్పు రావాలని ఆకాంక్ష

చాలామంది క్రికెటర్లకు కెరీర్ చివరి దశలో ఓ మ్యాచ్ ఆడి రిటైరయ్యే అవకాశం కల్పించడం తెలిసిందే. అయితే, భారత క్రికెట్ కు ఎనలేని సేవలు అందించిన యువరాజ్ సింగ్ వంటి ప్రతిభావంతుడి కెరీర్ ముగిసిన తీరు మాత్రం బాధాకరం. జట్టులో చోటు కోసం ఓ అనామక క్రికెటర్ లా ఎదురుచూడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. తాజాగా ఈ అంశంపై యువీ స్పందించాడు. తన కెరీర్ చివర్లో బీసీసీఐ వ్యవహరించిన తీరు అమర్యాదకరంగా ఉందని పేర్కొన్నాడు.

ఓ భారీ మ్యాచ్ తో వీడ్కోలు పలకలేనందుకు బాధగా లేదని, కానీ జాతీయ జట్టు కోసం సర్వశక్తులు ఒడ్డిన ఆటగాళ్లకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉందని స్పష్టం చేశాడు. సుదీర్ఘకాలం పాటు జాతీయ జట్టుకు సేవలు అందించిన ఆటగాళ్లు రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు బోర్డు అందుకు అనుగుణంగా వ్యవహరించాలని, వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని హితవు పలికారు.

"నేనేమీ లెజెండ్ అని భావించడంలేదు. అయితే దేశం కోసమే క్రికెట్ ఆడాను. నేను టెస్టు క్రికెట్ ఆడింది చాలా తక్కువ. అయితే ఓ ఆటగాడికి వీడ్కోలు పలకాలని అనుకుంటే దానిపై ఓ ఆటగాడు ఎలా నిర్ణయం తీసుకుంటాడు? బీసీసీఐనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. కానీ నా విషయంలో అలా జరగలేదనే భావిస్తున్నాను. నాకే కాదు, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, సెహ్వాగ్ లకు కూడా సరైన వీడ్కోలు లభించలేదు. వాళ్లతోనూ ఎంతో దారుణంగా వ్యవహరించారు.

గతంలోనూ ఇలాంటివి జరిగాయని తెలియడంతో నాకేమీ పెద్దగా ఆశ్చర్యం కలగడంలేదు. రెండు వరల్డ్ కప్ లు గెలిచిన గౌతమ్ గంభీర్ కు, టెస్టుల్లో సునీల్ గవాస్కర్ తర్వాత సిసలైన మ్యాచ్ విన్నర్ గా పేరుగాంచిన సెహ్వాగ్ కు సముచిత గౌరవం ఇవ్వాలి. వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ లకు కూడా ఆ గౌరవం దక్కాలి" అని తెలిపాడు. అయితే భవిష్యత్తులోనైనా సుదీర్ఘకాలం సేవలందించిన ఆటగాళ్లను సమున్నతరీతిలో గౌరవిస్తారని ఆశిస్తున్నట్టు యువరాజ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News