Marriage: వివాహం కోసం యూత్ న్యూ ట్రెండ్... ఓ అధ్యయనం వెల్లడించిన ఆసక్తికర అంశాలు!
- సర్వేలో పాల్గొన్న ఆరు లక్షల మంది
- పెద్దల ప్రమేయం లేకుండానే భాగస్వామి నిశ్చయం
- పేర్లు నమోదు చేసుకుంటున్న వారిలో ఇంజనీర్లే అత్యధికం
- కులం పట్టింపు లేదంటున్న 10 శాతం మంది అబ్బాయిలు
పెద్దల ప్రమేయం లేకుండానే యూత్,తమ వివాహాలను నిశ్చయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారని ఓ మ్యాట్రిమోనిసంస్థ చేసిన తాజా అధ్యయనం వెల్లడించింది. దాదాపు ఆరు లక్షల మంది యువతీ యువకులను ప్రశ్నించి అధ్యయనం చేయగా, పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయని సంస్థ పేర్కొంది. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో పెద్దలతో సంబంధం లేకుండానే ముందడుగు వేయడానికి మొగ్గుచూపుతున్నారు. అటు అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా ఇదే విధమైన ఆలోచనలో ఉండటం గమనార్హం.
దాదాపు 60 శాతం మంది యువత పెద్దల ప్రమేయం లేకుండానే తమకు నచ్చిన వారిని ఎంచుకోవాలని భావిస్తున్నారు. ఇక,76 శాతం మంది యువతీ యువకులు మ్యాట్రిమోనీ సంస్థల వద్దకు వెళ్లకుండానే వెబ్ సైట్ లు, యాప్ ల ద్వారా తమ వివరాలు నమోదుచేసుకుంటున్నారు. అబ్బాయిల్లో 26 శాతం మంది స్వరాష్ట్రం అమ్మాయిలను కోరుకుంటుండగా, అమ్మాయిల్లో 23 శాతం మంది తమ ప్రాంతం వారైతేనే బాగుంటుందని అంటున్నారు.
ఇక అమ్మాయిల్లో 67 శాతం మంది, అబ్బాయిల్లో 64 శాతం మంది తమ జీవిత భాగస్వామి దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఫర్వాలేదన్న అభిప్రాయంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ, విజయవాడ, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన యూత్ అధికంగా మ్యాట్రిమోనీలను ఆశ్రయిస్తున్నారు. 23 నుంచి 27 ఏళ్ల మధ్య ఉన్న అమ్మాయిలే అధికంగా వివాహం కోసం ఆన్ లైన్ మాధ్యమాలను ఆశ్రయిస్తున్నారు.
తమకు ఏ కులం వారైనా సమ్మతమేనని 8 శాతం మంది అమ్మాయిలు, 10 శాతం మంది అబ్బాయిలు వెల్లడించారు. ఇలా పెళ్లిళ్ల వెబ్ సైట్లలో పేర్లను నమోదు చేయించుకుంటున్న వారిలో 42 శాతం మంది ఇంజనీరింగ్ చదివిన వారు ఉండగా, అబ్బాయిల్లో 36.8 శాతం మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉండటం గమనార్హం.