West Bengal: బీజేపీలో చేరిన 24 గంటల వ్యవధిలోనే... రాజకీయాలనే వదిలేస్తున్నానన్న మాజీ ఫుట్ బాల్ స్టార్!
- మంగళవారం బీజేపీలో చేరిన మెహతాబ్ హూసియాన్
- బుధవారం నాడు రాజకీయాలు వద్దనుకుంటున్నట్టు ప్రకటన
- నిర్ణయం వ్యక్తిగతమైనదేనని వివరణ
బీజేపీలో చేరిన తరువాత 24 గంటలు తిరగకముందే తాను రాజకీయాలనే పూర్తిగా వదిలేస్తున్నానంటూ, భారత మాజీ ఫుట్ బాల్ స్టార్ మెహతాబ్ హోసియాన్ సంచలన ప్రకటన చేశారు. కోల్ కతా మైదాన్ లో 'మిడ్ ఫీల్డ్ జనరల్'గా గుర్తింపు తెచ్చుకుని, లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మెహతాబ్, తాను తీసుకున్న నిర్ణయం కేవలం వ్యక్తిగతమైనదేనని స్పష్టం చేశారు.
మంగళవారం నాడు పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ను కలిసి తాను బీజేపీలో చేరుతున్నట్టు మెహతాబ్ ప్రకటించారు. మురళీధర్ సేన్ లేన్ కార్యాలయానికి వచ్చి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించిన ఆయన, 'భారత్ మాతా కీ జై' అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, కాషాయ కండువా కప్పుకున్నారు.
ఆపై ఒకరోజు కూడా గడవకముందే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగుతున్నట్టు ప్రకటించారు. "నేను నేటి నుంచి ఏ రాజకీయ పార్టీకీ చెందిన వ్యక్తిని కాను. నా చర్యలతో నా మేలు కోలేవారికి ఇబ్బంది కలిగించి వుంటే క్షంతవ్యుడను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఒత్తిడీ లేదు. ఇకపై నేను రాజకీయాల్లో కొనసాగబోను" అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో మెహతాబ్ ప్రకటించారు.
అంతకుముందు రోజు మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు దగ్గరవ్వాలని భావిస్తున్నానని, అందుకే రాజకీయాలను ఎంచుకున్నానని అన్నారు. ప్రజలు కష్టాలు పడుతున్న సమయంలో వారికి సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇంత అకస్మాత్తుగా రాజకీయాల్లోకి రావాలని భావించానని తెలిపిన ఆయన, బీజేపీలో చేరిన తరువాత మాట మార్చారు. ప్రజలు తనను ఓ రాజకీయ నాయకుడిగా చూడాలని భావించడం లేదని, వారి మనోభావాలను తాను గౌరవిస్తానని అన్నారు. కాగా, భారత్ తరఫున 30 మ్యాచ్ లు ఆడిన మెహతాబ్, రెండు గోల్స్ చేశారు. 2018-19 సీజన్ లో మోహన్ బగాన్ క్లబ్ తరఫున ఆడిన తరువాత, ఆటకు గుడ్ బై చెప్పారు.