Bandi Sanjay: మీరు ప్రధానికి వాస్తవ పరిస్థితిని వివరించారో లేదోనని సందేహంగా ఉంది: కేసీఆర్ కు లేఖ రాసిన బండి సంజయ్

Bandi Sanjay writes CM KCR on corona pandemic

  • రాష్ట్రంలో కరోనాపై కేసీఆర్ కు మోదీ నుంచి ఫోన్
  • ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయన్న సంజయ్
  • నిజాలు దాచి చెలగాటం ఆడొద్దని కేసీఆర్ కు హితవు

తెలంగాణలో కరోనా పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్ ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడారని తెలిసిందని, కరోనాకు రూ.100 కోట్లు కేటాయించానని సీఎం కేసీఆర్ ప్రధానికి వివరించారని మీడియాలో వచ్చిందని బండి సంజయ్ తెలిపారు. అయితే, ఇప్పటివరకు కరోనా నియంత్రణకు వినియోగించిన నిధుల వివరాలు, ఖర్చులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందిన నిధులు, వాటి వ్యయం తదితర వివరాలే కాకుండా, సీఎం రిలీఫ్ ఫండ్ కు అందిన విరాళాలను ఎలా ఖర్చు చేశారన్న అంశంలోనూ రాష్ట్ర ప్రజలకు వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని సంజయ్ పేర్కొన్నారు.

"రాష్ట్రంలో చూస్తే కరోనా అంశంలో ప్రజల్లో తీవ్ర అభద్రతా భావం నెలకొని ఉంది. ప్రజలు కరోనా అంటేనే భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలపై సిబ్బందే ధర్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ పరిస్థితులపై తెలంగాణ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వెల్లడించాలి. ఓవైపు రాష్ట్ర హైకోర్టే కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం పట్ల, ఆసుపత్రుల్లో సౌకర్యాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రధాని మోదీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు వాస్తవాలు చెప్పారో, లేదోనని సందేహంగా ఉంది. దయచేసి నిజాలను దాచి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని మనవి చేస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా సమష్టిగా కరోనాపై పోరాడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి" అంటూ బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News