Balineni Srinivasa Reddy: ఒంటిమీద దెబ్బలు లేకపోయినా.. పోలీసులు కొట్టారని చెప్పడం సరికాదు: ఒంగోలు డీఎస్పీ
- కలకలం రేపుతున్న డబ్బు పట్టుబడిన ఘటన
- తప్పుడు పోస్టింగులు పెట్టాడంటూ సందీప్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
- కొందరి పేర్లు చెప్పాలంటూ పోలీసులు కొట్టారన్న సందీప్
తమిళనాడులో కారులో డబ్బు పట్టుబడిన ఘటన కలకలం రేపింది. ఆ డబ్బు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెందిందంటూ ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపింది. మరోవైపు ఆ డబ్బు నాదేనంటూ ఒంగోలుకు చెందిన బంగారం వ్యాపారి నల్లమల్లి బాలు స్వయంగా ఒప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో బాలినేని, అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి పేర్లను ఉటంకిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టారంటూ వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ చెప్పారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వడ్డేల సందీప్, తొట్టెంపూడి చంద్రలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అయితే తనను కొట్టారంటూ పోలీసులపై కూడా అసత్య ఆరోపణలు చేస్తూ సందీప్ సెల్ఫీ వీడియో తీశాడని చెప్పారు. ఒంటిపైన దెబ్బలు లేకుండా పోలీసులు కొట్టారని చెప్పడం సరికాదని తెలిపారు. సందీప్ పై గతంలో కూడా కేసులు ఉన్నాయని చెప్పారు. తరచుగా తప్పుడు పోస్టింగులు పెడుతూ వైషమ్యాలను రెచ్చగొడుతున్నాడని తెలిపారు.
మరోవైపు పోలీసుల తీరుపై సందీప్ ఆరోపణలు చేశాడు. తనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కొందరి పేర్లు చెప్పాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని తెలిపాడు. తాను చెప్పకపోవడంతో విపరీతంగా కొట్టారని చెప్పాడు. వైసీపీ నేతల వల్ల తనకు ప్రాణహాని ఉందని మీడియా ముఖంగా తెలిపాడు.