snake: పాములతో కేక్ తినిపించిన వైనం.. వీడియో వైరల్
- ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా ఘటన
- పాముల సంరక్షకులమని చెప్పుకుంటూ సెలబ్రేట్
- తీవ్ర విమర్శలు
ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా జూలై 16న పాముల సంరక్షకులు కొందరు చేసిన పని విమర్శలకు తావిస్తోంది. వన్యప్రాణులు ఇబ్బంది పడకుండా ఇతరులు ఎలాంటి విపరీత ధోరణులకు పాల్పడకుండా చూడాల్సిన వారే అటువంటి ఘటనకు పాల్పడ్డారు. పాములను పట్టుకుని, వాటి ముందే కేక్ కట్ చేసి, అనంతరం వాటితో కేక్ తినిపించారు. ఆ సమయంలో గొప్ప పని చేస్తున్నట్లు వీడియో తీసి మరీ సామాజిక మధ్యమాల్లో పోస్ట్ చేశారు. పాములను పట్టి, చంపేవారి కంటే వీరే ప్రమాదకరమంటూ వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఝార్ఖండ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఫోటాన్ సహ వ్యవస్థాపకుడు విరాట్ సింగ్ పాముల సంరక్షకులమంటూ చెప్పుకుని స్నేక్ డే నిర్వహించిన వారిపై విమర్శలు గుప్పించారు. రమేశ్ పాండే అనే ఐఎఫ్‌ఎస్ అధికారి కూడా ఈ ఘటనపై స్పందిస్తూ.. సహజ వనరుల పరిరక్షణ జ్ఞానాన్ని ప్రజలకు బోధించడం ఎంత అవసరమో ఈ వీడియోను చూస్తే అర్థమవుతోందని అన్నారు.
వన్యప్రాణుల పట్ల మంచి విధానాన్ని ప్రోత్సహించడంలో జూలు, సఫారీలు ముఖ్య పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షకుల మంటూ చెప్పుకుంటూ వారు పాల్పడ్డ ఈ చర్యలను మూర్ఖపు చర్యలుగా మరికొంతమంది అభివర్ణించారు. వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.