Police: వికాస్ దూబేకు ఎందుకు బేడీలు వేయలేదో సుప్రీంకోర్టుకు వివరించిన యూపీ పోలీసులు
- ఇటీవలే వికాస్ దూబే ఎన్ కౌంటర్
- సుప్రీంకోర్టులో విచారణ
- పోలీసులకు పలు ప్రశ్నలు సంధించిన అత్యున్నత న్యాయస్థానం
- అఫిడవిట్ సమర్పించిన పోలీసులు
సుమారు 60కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబేను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ చేయగా, సుప్రీంకోర్టులో దానిపై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అడిగిన అనేక ప్రశ్నలకు యూపీ పోలీసులు తమ అఫిడవిట్ లో వివరంగా జవాబులు ఇచ్చారు.
సుప్రీంకోర్టు: ఈ ఘటనలో పలు వాహనాలు మార్చింది నిజమేనా?
పోలీసులు: అతడి భద్రత కోసమే అనేక వాహనాలు మార్చాల్సి వచ్చింది. వికాస్ దూబేని స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాహనంలో ఉజ్జయిన్ నుంచి గుణా ప్రాంతానికి తీసుకువచ్చాం. గుణాలో మరో వాహనం మార్చాం. అక్కడ దూబేని దర్యాప్తు అధికారి రమాకాంత్ పచూరీ వాహనంలో ఎక్కించాం. అది ఎస్ యూవీ. ప్రమాదం జరిగిన సమయంలో మిడిల్ సీట్లో దూబే కూర్చోగా, అటు పచూరీ, ఇటు కానిస్టేబుల్ ప్రదీప్ కుమార్ కూర్చున్నారు.
సుప్రీంకోర్టు: పోలీసులు నాలుగు బుల్లెట్లను అంత కచ్చితమైన గురితో ఎలా కాల్చగలిగారు?
పోలీసులు: ఈ ఆరోపణలో వాస్తవం లేదు. నిజానికి పోలీసులు 6 రౌండ్లు కాల్చారు. వాటిలో 3 మాత్రమే దూబేకు తగిలాయి. పోలీసులు ఆత్మరక్షణకు ప్రయత్నించిన సమయంలో అత్యంత సమీపం నుంచి జరిగిన ఫేస్ టు ఫేస్ ఎదురుకాల్పుల ఘటన ఇది.
సుప్రీంకోర్టు: అతడికి బేడీలు ఎందుకు వేయలేదు?
పోలీసులు: వికాస్ దూబేను నేరుగా కాన్పూర్ కోర్టుకే తీసుకెళ్లాలని భావించాం. మూడు వాహనాలు ఎస్కార్టుగా ఉన్నాయి. 15 మంది పోలీసులు భద్రతగా ఉన్నారు. 24 గంటల్లో అతడిని కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. జూలై 10వ తేదీన ఉదయం 10 గంటల కల్లా అతడిని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బేడీలు వేయలేం!
సుప్రీంకోర్టు: ఘటన స్థలానికి 2 కిలోమీటర్ల దూరంలోనే మీడియాను ఆపేశారు.. ఎందుకు?
పోలీసులు: మీడియా వాహనాలను ఆపేయలేదు. మీడియా వాళ్లు ఉజ్జయిన్ నుంచి మమ్మల్ని అనుసరించే వస్తున్నారు. లైవ్ టెలికాస్ట్ కూడా ఇచ్చారు. అయితే మధ్యలో కొన్ని చెక్ పాయింట్లు ఉండడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయి కొన్ని మీడియా వాహనాలు నిలిచిపోయి ఉండొచ్చు. రెండు మీడియా వాహనాలు ఘటన జరిగిన వెంటనే వచ్చేశాయి.
సుప్రీంకోర్టు: కాల్పుల మోత విన్నామని స్థానికులు చెబుతున్నారు... కానీ ఒక్కరూ చూడకపోవడమేంటి?
పోలీసులు: తుపాకీ కాల్పుల మోత విన్నామంటూ స్థానికులు ఎవరూ అక్కడికి రాలేదు. వాహనం బోల్తాపడిన స్థలానికి సమీపంలో జనావాసాలు ఏమీ లేవు. పైగా ఆ సమయంలో భారీ వర్షం కురుస్తుండడంతో పాదచారులు ఎవరూ కనిపించలేదు. భారీ వర్షం కురవడం వీడియోలో కూడా రికార్డయింది.
సుప్రీంకోర్టు: దూబేకు గతంలో కాలు విరిగినప్పుడు కాలిలో రాడ్ అమర్చారు... ఉజ్జయిన్ లో కూడా కుంటుతూ కనిపించాడు... మరి ఘటన స్థలంలో ఎలా పరిగెత్తాడు?
పోలీసులు: నడవడానికి అతడికి ఎలాంటి ఇబ్బందులు లేవు. భిక్రు గ్రామంలో ఎనిమిది మంది పోలీసులను చంపిన తర్వాత అతడు మూడు కిలోమీటర్లకు పైగా పరిగెత్తాడు. ఉజ్జయిన్ మహాకాళి ఆలయం వద్ద రికార్డయిన వీడియోలో కూడా అతడు బాగానే నడుస్తున్నట్టు వెల్లడైంది. పోలీసులను చంపిన తర్వాత దూబే అనేక రాష్ట్రాలకు వెళ్లడం నడకపరంగా అతడికి ఎలాంటి అసౌకర్యంలేదన్న విషయాన్ని చాటుతోంది.
సుప్రీంకోర్టు: పోలీసులతోనూ, రాజకీయనేతలతోనూ తనకేమైనా రహస్య సంబంధాలున్నాయేమో దూబే వెల్లడించి ఉండేవాడేమో.. దీనిపై ఏమంటారు?
పోలీసులు: సరిగ్గా ఈ అంశాల్లో నిగ్గు తేల్చేందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఓ జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ను నియమించింది. వికాస్ దూబే, అతడి అనుయాయులకు పోలీసులతోనూ, ఇతర విభాగాల అధికారులతోనూ, రాజకీయనేతలతోనూ సంబంధాలు ఉంటే ఈ కమిషన్ దర్యాప్తులో తేలుతుంది.
అంతేకాకుండా, వికాస్ దూబేను కాన్పూర్ తీసుకువచ్చేందుకు చార్టర్డ్ విమానం ఏర్పాటు చేసుకోవాలని తాము ఏ దశలోనూ భావించలేదని, ఎస్టీఎఫ్ బృందాలు తగినన్ని అందుబాటులో ఉండడంతో రోడ్డు మార్గంలోనే తీసుకువచ్చామని పోలీసులు తమ అఫిడవిట్ లో వివరించారు.