Lakshadweep: భారత్ లో కరోనా సోకని ప్రాంతం ఇదొక్కటే!

Lakshadweep witnessed no corona cases till date
  • లక్షద్వీప్ లో కరోనా కేసులు సున్నా
  • కట్టుదిట్టమైన చర్యలతో ఆదర్శంగా నిలుస్తున్న లక్షద్వీప్
  • అప్పట్లోనే సరిహద్దులు మూసేసిన కేంద్రపాలిత ప్రాంతం
గతేడాది చివరి నుంచి కరోనా మహమ్మారి తన ప్రభావం చూపడం మొదలుపెట్టగా, దాదాపు అన్ని దేశాలు ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోలేకపోయాయి. అయితే, భారత్ లోని ఓ భాగంలో మాత్రం ఈ వైరస్ వ్యాప్తి ఏమాత్రం లేదు. అదే లక్షద్వీప్. కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా రాలేదంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ఇది నిజం. భారత్ లో ఫిబ్రవరిలో కరోనా వ్యాప్తి ప్రారంభం కాగా, ఇప్పటివరకు లక్షద్వీప్ లో కరోనా పాజిటివ్ అన్న మాటే వినపడలేదు. దానికి కారణం అక్కడి ప్రభుత్వ యంత్రాంగం సమర్థత అని చెప్పాలి.

లక్షద్వీప్ జనాభా 64,473 కాగా, అందుబాటులో ఉన్న ఆసుపత్రులు మూడంటే మూడే. దాంతో, నివారణ చర్యలపైనే అక్కడి ప్రభుత్వం కఠినంగా దృష్టి పెట్టింది. రాజధాని కవరాట్టికి వచ్చే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచడమే కాదు, వారికి తప్పనిసరిగా క్వారంటైన్ విధిస్తున్నారు. అంతేకాదు, తమ ప్రాంతానికి రావాలనుకునేవారిని కేరళలోని కొచ్చి రేవుపట్టణంలో రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంచుతున్నారు. లక్షద్వీప్ కు ప్రధాన రవాణా కొచ్చి నుంచే జరుగుతుంది కాబట్టే, ఇక్కడి నుంచి వారి కరోనా నివారణ చర్యలు మొదలవుతాయి.

కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థితికి చేరిందని తెలియగానే లక్షద్వీప్ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. లోపలికి ఎవరినీ అనుమతించకుండా కరోనాను ఆమడదూరంలో నిలిపివేసింది. ఓవైపు భారత్ ప్రధాన భూభాగం సహా, ఇతర ప్రాంతాల్లో కేసులన్నీ కలిపి 10 లక్షలు దాటినా, ఈ చిన్న ద్వీప సమూహంలో మాత్రం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 61 మందికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించగా, అందరికీ నెగెటివ్ వచ్చింది. మొత్తమ్మీద కరోనాపై పోరాటంలో లక్షద్వీప్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పుడక్కడ స్కూళ్లు తెరిచేందుకు సన్నద్ధమవుతున్నారు. కేంద్రం ఓకే అంటే చాలు బడిగంటలు మోగనున్నాయి.
Lakshadweep
Corona Virus
Cases
India
COVID-19

More Telugu News