Corona Virus: అనూహ్య మార్గాల్లో విజృంభిస్తున్న కరోనా... పలు దేశాల్లో మరో లాక్ డౌన్ పై సమాలోచనలు!

Corona Spreading with No Trace

  • ఎక్కడి నుంచి, ఎలా వస్తుందో తెలియని వైరస్
  • కొత్త ప్రాంతాల్లో పుట్టుకొస్తున్న కేసులు
  • చాలా దేశాల్లో లాక్ డౌన్ విధించే ఆలోచన

ఆసియా పసిఫిక్ దేశాల్లో కరోనా మహమ్మారి ఇప్పుడు ఊహకందని మార్గాల్లో విజృంభిస్తోంది. దీంతో పలు దేశాలు మరో విడత లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నాయి. కరోనా సోకుతున్న రోగులకు ఇతర ఇన్ఫెక్షన్ సోకిన వారితో ఎటువంటి సంబంధమూ లేకపోవడం, వారెవరకూ కరోనా విస్తరిస్తున్న ప్రాంతానికి చెందిన వారు కాకపోవడంతో వైరస్ ఎలా వ్యాపిస్తోందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే ఇప్పుడు అధికారులను తలపట్టుకునేలా చేస్తోంది.

ఈ తరహా కేసులు పలు నగరాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా, హాంకాంగ్ లో ఎవరికీ సంబంధం లేకుండానే వైరస్ పలువురిని కబళిస్తోంది. "కరోనా చైన్ ను తెగ్గొట్టడం చాలా కష్టతరమైంది. ఈ వైరస్ ఎక్కడి నుంచి వస్తోందో తెలియడం లేదు. ఒక్క కేసు కూడా లేని ప్రాంతంలో ఇప్పుడు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో వైరస్ ఎక్కడి నుంచి, ఎలా వచ్చిందో అర్ధం కావడం లేదు" అని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యాంగ్ గోంగ్హువాన్ వ్యాఖ్యానించారు.

కాగా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాల్లో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. ఇప్పటికీ అక్కడి కొత్త కేసుల సంఖ్య వందల్లోనే ఉంది. దీంతో అక్కడి అధికారులు కొంత రిలాక్స్ డ్ గానే ఉన్నారు. ఈ దేశాలు నియమిత లక్ష్యాలను ఎంచుకుని వాటిని కట్టడి చేస్తూ, కరోనాపై పోరాడుతున్నాయి. వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో సమస్తమూ మూసివేస్తూ, మిగతా ప్రాంతాల్లో సాధారణ స్థితినే అమలు చేస్తున్నారు.

ఆసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న చైనాలో వైరస్ పుట్టిందన్న సంగతి తెలిసిందే. ఆపై వైరస్ కట్టడిలో ఆ దేశం విజయం సాధించగా, మూడు నెలల పాటు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆపై ఊహించని విధంగా ఈ నెలలో వైరస్ వ్యాప్తి తిరిగి మొదలైంది. కొత్త కొత్త ప్రాంతాల్లో కేసులు వస్తున్నాయి.

వైరస్ ను కట్టడి చేసేందుకు దాదాపు 50 లక్షల మంది నివసిస్తున్న ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో మరోసారి లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. ఇక్కడ ఆరు వారాల లాక్ డౌన్ ను విధించారు. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో 51 శాతం కేసులు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా  తెలియని పరిస్థితి నెలకొంది. లాక్ డౌన్ నిబంధనలను సడలించడం ప్రారంభించిన తరువాత ఇండియా, రష్యా వంటి దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది.

ఈ నేపథ్యంలోనే పలు దేశాల ప్రభుత్వాలు మరో విడత నిబంధనలను అమలు చేయడం ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని భావిస్తున్నాయి. కనీసం వైరస్ కు వ్యాక్సిన్ వచ్చేంతవరకూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటేనే మంచిదని సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News