Dark Web: అమ్మకానికి.. ట్విట్టర్ సీఈవో, జస్టిన్ బీబర్ సహా 14.2 కోట్ల మంది వ్యక్తిగత డేటా!
- కోట్లాది మంది డేటాను కొల్లగొడుతున్న హ్యాకర్లు
- డార్క్ వెబ్ లో అమ్మకానికి 14.2 కోట్ల మంది డేటా
- రూ. 2.18 లక్షలకు అమ్మకానికి పెట్టిన హ్యాకర్
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరి వ్యక్తిగత సమాచారానికి కూడా రక్షణ లేకుండా పోతోంది. వివిధ మార్గాల ద్వారా కోట్లాది మంది డేటాను కొల్లగొడుతున్న హ్యాకర్లు.. వాటిని బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నారు. తాజాగా డార్క్ వెబ్ ద్వారా 14.2 కోట్ల మంది డేటా అమ్మకానికి వచ్చింది. అమెరికాలోని లాస్ వెగాస్ లో ఉన్న ఎంజీఎం రిసార్ట్స్ హోటల్స్ లో బస చేసిన వారి డేటాను మన కరెన్సీలో రూ. 2.18 లక్షలకు అమ్మకానికి పెట్టారు. డేటా హ్యాకింగ్ కు సంబంధించిన సమాచారం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బయటకు వచ్చింది. 2019లో కేసినో కేపిటల్ లాస్ వెగాస్ లో బస చేసిన వారిలో సెలబ్రిటీలు, టెక్ సీఈవోలు, టెక్ ఉద్యోగులు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు తదితరులు ఉన్నారు.
హ్యాక్ అయిన డేటాలో ఆయా వ్యక్తుల పూర్తి పేర్లు, ఇంటి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్, పుట్టిన తేదీలు తదితర వివరాలు ఉన్నాయి. అమ్మకానికి రెడీగా ఉన్న డేటాలో ట్విట్టర్ సీఈవో జాక్ డార్సీ, పాప్ స్టార్ జస్టిన్ బీబర్ వంటి ప్రముఖుల డేటా కూడా వుంది. ఇక లాస్ వెగాస్ లోని ఎంజీఎం రిసార్ట్స్ లో బెల్లాగియో, ఆరియా, ఎంజీఎం గ్రాండ్, మాండలే బే, పార్క్ ఎంజీఎం, మిరేజ్, లగ్జర్, ఎక్స్ క్యాలిబర్ వంటివి ఉన్నాయి.