Patna AIIMS: పాట్నా ఎయిమ్స్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్... 18 మంది వలంటీర్లను ఎంపిక చేసిన ఐసీఎంఆర్
- కోవాగ్జిన్ పేరుతో కరోనా వ్యాక్సిన్ తయారుచేసిన భారత్ బయోటెక్
- క్లినికల్ ట్రయల్స్ కు ఏర్పాట్లు
- 12 వైద్య సంస్థలను ఎంపిక చేసిన ఐసీఎంఆర్
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు సర్వం సిద్ధమైంది. పాట్నా ఎయిమ్స్ లో నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనేందుకు 18 మంది వలంటీర్లను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఎంపిక చేసింది. వీరంతా 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వారు. మొదట వీరందరికీ పూర్తిస్థాయిలో మెడికల్ చెకప్ నిర్వహిస్తారు. వారి వైద్య పరీక్షల నివేదికలను సమగ్రంగా విశ్లేషించి ఆపై వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతులు మంజూరు చేస్తారు.
ఈ వలంటీర్లకు వ్యాక్సిన్ తొలిడోసు ఇచ్చిన తర్వాత రెండు మూడు గంటల పాటు పరిశీలనలో ఉంచుతారు. క్లినికల్ ట్రయల్ పూర్తవ్వాలంటే మూడు డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 12 వైద్య సంస్థలను ఎంపిక చేసింది. వాటిలో పాట్నా ఎయిమ్స్ ఒకటి. హైదరాబాదులోని నిమ్స్ వైద్య సంస్థ కూడా క్లినికల్స్ ట్రయల్స్ కు ఎంపికైంది.