Doctor: కరోనా రోగి మృతదేహాన్ని ట్రాక్టర్ లో వేసుకుని స్వయంగా శ్మశానానికి తీసుకెళ్లిన ప్రభుత్వ వైద్యుడు... అభినందించిన హరీశ్ రావు
- పెద్దపల్లిలో కరోనా రోగి మృతి
- మృతదేహం తరలింపుకు ఎవరూ ముందుకు రాని వైనం
- చొరవ తీసుకుని ముందుకొచ్చిన డాక్టర్ శ్రీరామ్
- మానవత్వం బతికే ఉందన్న మంత్రి హరీశ్ రావు
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం నాడు ఓ కరోనా రోగి మరణించగా, ఆ మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ రాకపోవడంతో ఓ ప్రభుత్వ వైద్యుడు స్పందించిన వైనం ప్రశంసనీయం. పురపాలక సిబ్బంది ఓ ట్రాక్టర్ ను ఆసుపత్రి వరకు తీసుకువచ్చారే తప్ప కరోనా రోగి మృతదేహాన్ని తీసుకెళ్లలేకపోయారు. అయితే, సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ గా పనిచేస్తున్న శ్రీరామ్ అక్కడే ఉన్నారు. ఆయన ఈ పరిస్థితిని గమనించి వెంటనే ముందుకొచ్చారు. రోగి బంధువుల సాయంతో మృతదేహాన్ని ట్రాక్టర్ లోకి తరలించి, ఆపై తానే స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ శ్మశానానికి తీసుకెళ్లారు.
డాక్టర్ శ్రీరామ్ మానవత్వం మంత్రి హరీశ్ రావును ఆకట్టుకుంది. మనుషుల్లో మానవత్వం బతికే ఉందని నిరూపించారు శ్రీరామ్ గారూ అంటూ అభినందించారు. మానవత్వంలోనే దైవత్వం దర్శించుకునేలా చేశారంటూ కొనియాడారు. కరోనాపై యుద్ధం చేస్తున్న ప్రతి ఒక్కరికీ మీరు స్ఫూర్తిగా నిలిచారంటూ హరీశ్ రావు ప్రశంసించారు. ఈ కష్టకాలంలో ప్రజారోగ్య రక్షణకు పాటుపడుతున్న ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.