Vikas Dubey: ఎంత ధైర్యం ఉంటే మనపై దాడికి వస్తారు.. ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు!... దాడి సందర్భంగా వికాస్ దూబే రంకెలు
- సంచలనం సృష్టించిన వికాస్ దూబే గ్యాంగ్
- యూపీలో 8 మంది పోలీసుల మృతి
- ఎఫ్ఐఆర్ లో ఆసక్తికర విషయాలు వెల్లడి
ఉత్తరప్రదేశ్ లోని భిక్రు గ్రామంలో పోలీసులపై వికాస్ దూబే గ్యాంగ్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడడం జాతీయస్థాయిలో అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. తమను పట్టుకోవడానికి పోలీసులు వస్తున్నారని ముందే సమాచారం అందుకున్న కరుడుగట్టిన నేరస్తుడు వికాస్ దూబే పకడ్బందీ ప్రణాళికతో ఎనిమిది మంది పోలీసులను బలిగొన్నాడు. ఈ ఘటనపై చౌబేపూర్ ఎస్సై వినయ్ తివారీ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. వికాస్ దూబేతో పాటు 21 మంది వ్యక్తులపైనా, మరో 80 మంది గుర్తుతెలియని దుండగులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్సై వినయ్ తివారీని ఉన్నతాధికారులు వెంటనే సస్పెండ్ చేశారు. వికాస్ దూబేకు పోలీసు శాఖకు చెందినవాళ్లే ఉప్పందించారన్న కారణంతో పలువురు పోలీసులను సస్పెండ్ చేయగా, వారిలో తివారీ కూడా ఉన్నాడు. ఇక, తివారీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి.
"పోలీసులు భిక్రు గ్రామంలోని వికాస్ దూబే ఇంటి వద్దకు వెళ్లగానే అనూహ్యరీతిలో ప్రతిఘటన ఎదురైంది. వికాస్ దూబే 100 మందితో పోలీసులను ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో పోలీసులు 32 మందే ఉన్నారు. దూబే ఇంటి వద్దకు చేరుకోగానే అన్ని వైపుల నుంచి పోలీసులపై దాడి జరిగింది. పోలీసులను చూడడంతోటే వికాస్ దూబే... అందరినీ చంపేయండి, ఎంత ధైర్యం ఉంటే మనపైనే దాడికి వస్తారు? ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు! అంటూ కేకలు వేశాడు. ఈ దాడి రాత్రి 1 గంటకు మొదలై 1.30 గంటలకు ముగిసింది. సర్కిల్ ఆఫీసర్ దేవేంద్ర మిశ్రాను దూబే బంధువు ఇంట్లోకి లాక్కెళ్లి గొడ్డలితో నరికి చంపారు" అంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.