LG Polymers: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై 350 పేజీల రిపోర్టును జగన్ కు సమర్పించిన కమిటీ
- రెండు నెలల పాటు ప్రమాదంపై అధ్యయనం
- పైపింగ్ లో మార్పులతో డిస్టర్బ్ అయిన సిస్టమ్
- అలారం కూడా మోగలేదన్న కమిటీ
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ కు హైపవర్ కమిటీ నివేదికను అందించింది. మొత్తం 350 పేజీల నివేదికను సీఎంకు కమిటీ ఛైర్మన్ నీరబ్ కుమార్ అందించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా నివేదికలో సమర్పించారు. మొత్తం రెండు నెలల పాటు ప్రమాదంపై వీరు అధ్యయనం చేశారు. ఎల్జీ పాలిమర్స్ నుంచి కూడా పలు వివరాలను సేకరించారు.
అనంతరం నీరబ్ కుమార్ మాట్లాడుతూ, ట్యాంక్ లో ఉష్ణోగ్రత పెరగడంతో హై ప్రెజర్ ఏర్పడి గ్యాస్ లీకైందని ఈ సందర్భంగా తెలిపారు. ట్యాంక్ డిజైన్, కూలింగ్ సిస్టమ్ సరిగా లేవని... సిబ్బందికి కూడా అవగాహన లేదని, అందువల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. 2019 డిసెంబర్ లో పైపింగ్ లో మార్పులు చేశారని... దీంతో మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అయిందని తెలిపారు. నియంత్రణ వ్యవస్థలో కూడా లోపాలను గుర్తించామని, సేప్టీ బోర్డును ఏర్పాటు చేయాలని బోర్డుకు సూచించామని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత సైరన్ కూడా మోగలేదని తెలిపారు.