Narendra Modi: విమర్శలపై నోరువిప్పిన ఇండియన్ ఆర్మీ... అది ఆడియో, వీడియో హాలేనని ఒప్పుకోలు!
- రెండు రోజుల క్రితం మోదీ పర్యటన
- చిత్రాల్లో కనిపించిన ప్రొజెక్టర్లు, స్పీకర్లు
- మోదీ కోసం సెట్ వేశారంటూ విమర్శలు
- స్పందించిన భారత ఆర్మీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రెండురోజుల క్రితం లడఖ్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మెడికల్ వార్డులోని సైనికులను పరామర్శించిన వేళ, ప్రభుత్వం విడుదల చేసిన ఆ చిత్రాల్లో వీడియో ప్రొజెక్టర్లు, తెరలు, స్పీకర్లు కనిపించాయన్న సంగతి తెలిసిందే. ఒక్క బెడ్ పక్కన కూడా ఆక్సిజన్ సిలిండర్, సెలైన్ స్టాండ్ వంటి మెడికల్ ఎక్విప్ మెంట్ కనిపించక పోవడం, అందరు సైనికులూ కూర్చునే ఉండటంతో, మోదీ ఫోటోలు దిగేందుకు మాత్రమే కావాలని అలా సెట్టింగ్ చేశారని తీవ్ర విమర్శలు రాగా, ఆర్మీ స్పందించింది. తాజాగా ఈ ఆరోపణలపై సైన్యాధికారులు స్పందించారు.
ప్రధాని పర్యటనను దృష్టిలో పెట్టుకుని, ఓ ఆడియో - వీడియో కాన్ఫరెన్సింగ్ రూమ్ ను కొవిడ్-19 వార్డుగా మార్చామని ఆర్మీ పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్మీ అధికారులపైనా, చికిత్స పొందుతున్న జవాన్లపైనా ఇటువంటి విమర్శలు రావడం దురదృష్టకరమని, గాయపడిన జవాన్లందరికీ అత్యుత్తమ వైద్య సేవలను దగ్గర చేశామని పేర్కొంది. కాగా, శుక్రవారం నాడు నరేంద్ర మోదీ అకస్మాత్తుగా లడఖ్, లేహ్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. చైనాతో వివాదం జరిగిన కొన్ని రోజుల తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది.
మోదీ పర్యటన చిత్రాల్లో హాస్పిటల్ చిత్రాలపై విమర్శలు వచ్చాయి. ఓ థియేటర్ రూమ్ ను మోదీ కోసం వార్డుగా మార్చారని చెబుతూ పలు చిత్రాల్లో కనిపిస్తున్న ప్రొజెక్టర్లను హైలైట్ చేస్తూ చిత్రాలు వెలువడ్డాయి. మరికొందరైతే ఇంకో అడుగు ముందుకేసి, ఆసుపత్రుల్లో కనిపించే డాక్టర్లు నర్సులు అక్కడ లేరని, మెడికల్ ఎక్విప్ మెంట్ కనిపించడం లేదని, ఐవీలు, నీడిల్స్ లేవని, ఎవరికీ గాయపడిన దాఖలాలు కనిపించడం లేదని బెడ్ పక్కన సైడ్ టేబుల్, వాటర్, మందులు, రిపోర్టులు కనిపించలేదని, వీటి స్థానంలో ప్రొజెక్టర్, మైక్ తో ఉన్న డయాస్, వైట్ బోర్డ్ కనిపించాయని కామెంట్లు పెట్టారు.